దేవుడా: కరోనా వేళ కూడా.. లంచాల విశ్వరూపం?
ఈ ఏడాది ఆరంభంలో దేశంలో కరోనా విజృంభించింది. చాలామంది జనం పిట్టల్లా రాలిపోయారు. కరోనా రోగులకు ఆస్పత్రులు కిటకిటలాడాయి. కొన్ని రకాల ఇంజక్షన్లు, మందుల కోసం జనం బారులు తీరారు. ఓవైపు జనం ఉపాధి లేక అల్లల్లాడిపోయారు. దౌర్భాగ్యం ఏంటంటే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన దేశంలో అవినీతి విశ్వరూపం చూపించిందట. అంతే కాదు.. సాధారణ రోజుల్లో కంటే మరో 40 శాతం అదనంగా జనం లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చిందట.
కరోనా సమయంలో జనం పడిన బాధలపై ఇటీవల లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. కరోనా బాధితులు ఇచ్చిన లంచాలతో వార్డు బాయ్‌ల జేబులు బాగా నిండిపోయినట్టు ఈ లోకల్ సర్కిల్స్ సర్వే చెబుతోంది. దేశంలోని 300 జిల్లాలకు చెందిన 16,000 మంది నుంచి వివరాలు సేకరించి లోకల్ సర్కిల్స్ సర్వే ఈ నివేదిక రూపొందించింది. ఈ సర్వే వెల్లడించిన వివరాలు చూస్తే.. అసలు మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందా.. చచ్చిపోయిందా అన్న అనుమానం రాకమానదు.
కరోనా రెండోదశలో చికిత్స పొందిన ప్రతి 10 మంది పౌరుల్లో నలుగురు లంచాలు ఇవ్వాల్సి వచ్చిందట. వీరంతా ఆరోగ్య సిబ్బందికి, ఆస్పత్రి యాజమాన్యానికి లంచాలు ఇచ్చినట్లు లోకల్ సర్కిల్స్ సర్వే చెప్పింది. 2021 ఏప్రిల్ - మే నెలల మధ్యలో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఔషధాలు వంటి వాటి కోసం ప్రజలు అల్లాడిపోయారు. వీటి కోసం జనం ముడుపులు చెల్లించక తప్పలేదని లోకల్ సర్కిల్స్ సర్వే చెబుతోంది. అంతే కాదు.. చికిత్స తర్వాత ఆస్పత్రి యాజమాన్యాలు వేసిన బిల్లులను తగ్గించేందుకు కూడా 9శాతం మంది లంచం ఇవ్వక తప్పలేదట.
ఐసీయూల్లో ఉన్న తమ వారి బాగోగులు తెలుసుకునేందుకు, ఐసీయూల్లో ఉన్నవారిని చూసేందుకు కూడా జనం లంచాలు ఇవ్వాల్సి వచ్చిందట. అయితే.. వీరిలో ఒక్కరు కూడా డాక్టర్‌కు గానీ, నర్సుకు గానీ లంచం ఇచ్చినట్లు చెప్పలేదట. వీరిలో 28శాతం ప్రజలు వార్డు బాయ్‌లకు.. 27 శాతం ఆస్పత్రుల్లోని అడ్మిన్ సిబ్బందికి లంచాలు ఇచ్చారట. మరో 10 శాతం మంది లోకల్ లీడర్లకు, ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులకు ఇవ్వాల్సి వచ్చిందట.