ఉద్యోగుల్లో ఉత్కంఠ: జగన్.. ఊ అంటాడా.. ఊహూ.. అంటాడా?

ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ యుద్ధం త్వరలోనే ముగియబోతోంది. 2,3 రోజుల్లోనే పీఆర్సీపై సీఎం తేల్చేస్తారని ఏకంగా సీఎస్ ప్రెస్‌మీట్లోనే చెప్పేసిన నేపథ్యంలో సీఎం నిర్ణయం కొద్దిగంటల్లోనే వెలువడే అవకాశం ఉంది. అయితే.. ఇంతకీ ఉద్యోగులు కోరుతున్నదేంటి.. ప్రభుత్వం చెబుతున్నదేంటి.. పీఆర్సీపై సీఎస్ కమిటీ ఏమంటోంది.. మరి చివరకు జగన్ ఏమంటారు.. ఉద్యోగుల డిమాండ్లకు ఊ అంటారా.. ఊహూ అంటారా.. సీఎస్ కమిటీ ప్రతిపాదనలకు ఊ అంటారా.. ఊహూ అంటారా.. ఇదీ ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా నడుస్తున్న ఉద్యోగ రాజకీయం.


ఇలాంటి సమస్యల్లో ఎవరి వాదన వారికి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ కష్టాలు తమవి అంటారు.. కొన్ని విషయాల్తో వారు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటారు.. ఆ ప్రభుత్వం అంత ఫిట్‌మెంట్ ఇచ్చింది.. ఈ సర్కారు ఇలా చేస్తోంది అని చెప్పుకుంటారు.. అయితే.. ఎవరికి వారు తమకు అనుకూలమైన విషయాలనే ప్రచారం చేస్తుంటారు. అది సహజమే. ఎవరు ఏం చెప్పినా.. చివరకు ఏం అమలు చేస్తారన్నదే కీలకం. అయితే.. ఇప్పుడు ఉద్యోగులు అడుగుతున్నంతగా 40 శాతంపైగా ఫిట్‌మెంట్‌ ఇచ్చే అవకాశం నూటికి నూరు శాతం లేనేలేదు. ఈ విషయం స్పష్టం.


ఉద్యోగ సంఘాలు మాత్రం కనీసం ఫిట్‌మెంట్‌ 34 శాతానికి పైగా ఉండాలని పట్టుబడుతున్నాయి. కానీ.. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే చాలా ఇస్తున్నాం.. ఇంకా ఇస్తే రాష్ట్రాన్ని నడపలేం.. రాష్ట్రం అంటే ఉద్యోగులు ఒక్కటే కాదు కదా అంటున్నాయి. దీనికి తోడు జగన్ సర్కారు ప్రజాసంక్షేమ పథకాలకు పెట్టింది పేరు. అటు బోలెడు సంక్షేమ పథకాలకు రొక్కం సమకూరుస్తూ.. ఇటు ఉద్యోగుల కోర్కెలు కూడా తీర్చాలంటే ఏపీ ఆదాయంతో అయ్యే పని కాదు. అందులోనూ కరోనా దెబ్బకు రెవెన్యూ కూడా కుదించుకుపోయింది.


ఇలాంటి సమయంలో జగన్ ఎవరిని ఎలా సంతృప్తిపరుస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చేసినందువల్ల ఫిట్‌మెంట్‌ కూడా కాస్త అటూ ఇటూగా అంతే ఉండొచ్చన్నది ఆర్థిక పరిస్థితి తెలిసిన నిపుణులు చెబుతున్నమాట. ఉద్యోగులకు దానికి సిద్ధం చేయడంలో భాగంగానే సీఎస్ కమిటీ నివేదిక అంత కఠినంగా ఉందన్నవాదన ఉంది. చూడాలి మరి జగన్ ఉద్యోగులను ఎలా చల్లబరుస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: