ఏందబ్బా.. ఈ రాజకీయం.. జడ్జిలపైనే చంద్రబాబు విమర్శలా..?
అయితే.. న్యాయవ్యవస్థలోనూ చంద్రబాబుకు చాలా మంది సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల కారణంగానే ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా అవి నిలబడవని.. కేవలం స్టేల దగ్గరే ఆగిపోతాయని ఆయన విమర్శలు చెబుతుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు ఉద్యమ కారులు కూడా ఇవే తరహా విమర్శలు చేశారు. చంద్రబాబును కోర్టుల్లో దోషి నిరూపించలేమని విమర్శించారు. ఇక జగన్ అయితే ఏకంగా ఆయనకు ఓ న్యాయ దిగ్గజంతో సంబంధాలు ఉన్నాయని.. ఏకంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాశారు.
అలా న్యాయవ్యవస్థతో మంచి సంబంధాలు ఉన్నాయని పేరున్న చంద్రబాబు కూడా ఇప్పుడు న్యాయమూర్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే.. కొందరు రిటైర్డ్ జడ్జిలు ఇప్పుడు జగన్ సర్కారు వైపు మాట్లాడుతున్నారు. ఇంకొందరు రిటైర్డ్ జడ్జిలు ఏకంగా జగన్తో సన్నిహితంగా ఉంటూ ఆయనకు న్యాయ సలహాలు ఇస్తున్నారు. అదే చంద్రబాబుకు ఆ రిటైర్డు జడ్జిలపై కోపానికి కారణమయ్యింది. వారే ఇటీవల జై భీమ్ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు.. అలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్.. వీరిని పేర్లు పెట్టకుండా చంద్రబాబు ఏకిపారేశారు.
ఇంతకూ చంద్రబాబు ఏమన్నారంటే.. ఒక జడ్జి ఇక్కడికొచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు.. రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు ఈ జడ్జిలకు పట్టవా?.. ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జిలకు కనపడవా?.. ఒక నేరస్థుడికి ఇలాంటివారు మద్దతు ఇవ్వవచ్చా?.. ఒకాయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.. కుమారుడికి పదవి తీసుకుని జగన్ను పొగుడుతున్నారు.. రిటైర్ అయ్యాక వీరికి పదవులు కావాలి.. అందుకే ఈ వ్యాఖ్యలు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. కోర్టులనే మేనేజ్ చేస్తారని విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబే ఇలా జడ్జిలపై విమర్శలు చేయడం చూసి చాలామంది అవాక్కవుతున్నారు.