తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించడం, అధికార పీఠం అందుకోవడమే లక్ష్యంగా తనదైన వ్యూహాలతో ముందుకు వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ప్రజలనుంచి వస్తున్నస్పందన ఆ పార్టీ క్యాడర్‌లో జోష్ నింపుతోందనే చెప్పాలి. మొదటినుంచీ కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్న రేవంత్‌ను నిలువరించేందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా గట్టి ప్రయత్నాలే చేస్తూ వచ్చినా, కేసులు పెట్టి వేధించినా రేవంత్ పోరాటంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. కేసీఆర్ కు తానే ప్రత్యామ్నాయమనే అభిప్రాయాన్ని జనంలో కలిగించడంలో ఆయన కొంతవరకు విజయవంతమయ్యారనే చెప్పాలి. ఇదే సమయంలో అటు బీజేపీ కూడా తెలంగాణలో గతంలో కంటే బలపడటం, ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని వ్యూహాలు పన్నుతుండటంతో రేవంత్‌కు ఆ పార్టీతోనూ పోరాటం చేయక తప్పని పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోవాల్సిరావడం సహజమే. అయితే సొంత పార్టీలోని సీనియర్ నాయకులతో పోరాడాల్సి వస్తే మాత్రం ఏ నాయకుడికైనా కాస్త ఇబ్బందే.
తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. రేవంత్‌కు ప్రజా బలమున్నా, ఆయనను టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడిగానే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పరిగణిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం లేదు. అసలు ఆయన చేతికి రాష్ట్ర పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించడాన్నివ్యతిరేకిస్తూ అప్పట్లో వారు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం ముందు తమ వాదనను గట్టిగానే వినిపించారు. అయినా రేవంత్ ను నమ్మిన ఆ పార్టీ అధినాయకత్వం పార్టీ పగ్గాలను ఆయనకే అప్పగించింది. రేవంత్‌ను వ్యతిరేకించినవారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోమటిరెడ్డి బ్రదర్స్‌నే. వీరిలో వెంకటరెడ్డి భువనగిరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కష్టకాలంలోనూ పార్టీని నిలబెట్టిన తమకే పార్టీ పగ్గాలు ఇస్తుందని వీరు ఆశించారు. అయితే వీరి ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాత్రమే పరిమితం. మరో సీనియర్ నాయకుడు పార్టీ తరపున ఎమ్మెల్సీ ఉన్న జీవన్‌రెడ్డి కూడా ఈ పదవిని ఆశించారు. ఆయనకున్న ప్రజాకర్షణ కూడా పరిమితమే. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన మరో కురువృద్ధుడు కె. జానారెడ్డికి ఉప ఎన్నికల్లో ఓటమి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇవన్నీ ముందే ఊహించిన రేవంత్ మొదటినుంచీ సీనియర్ నాయకులను గౌరవిస్తూ వారిని కలుపుకుని వెళ్లేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. వారి నుంచి ఇప్పటికీ ఆయనకు ఆశించినంత మద్దతు రావడం లేదని, లేకుంటే పార్టీ ఇప్పటికే మరింత బలం పుంజుకునేదన్న అభిప్రాయాలు పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.