మోదీ దీదీల మధ్య పోరు మళ్లీ షురూ..?
దేశ రాజధానిలో ఈ నెల 26న జరగబోయే గణతంత్ర దిన ఉత్సవం సందర్భంగా ప్రతి ఏటా పాల్గొనే విధంగానే అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొనబోతున్నాయి. ఈ వేడుకల్లో బెంగాల్ ప్రభుత్వం తరపున ప్రదర్శించేందుకు ప్రతిపాదించిన శకటాన్ని కేంద్రం తిరస్కరించడంపై మమత ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. కేంద్రం నిర్ణయం తమకు తీవ్ర ఆవేదనను, దిగ్భ్రాంతిని కలిగించిందని, ఏవిధమైన కారణం చూపకుండానే బెంగాల్ శకటాన్ని తిరస్కరించడమేమిటంటూ ఆమె ఆదివారం ప్రధాని మోదీకి ఘాటుగా లేఖ రాశారు. దేశం గర్వించే స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ నాయకుడు, సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకుని ఆయనను, ఆయన స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ ను స్మరించుకునేలా ఈ శకటం రూపుదిద్దుకున్నట్టు బెంగాల్ టైగర్ పేర్కొన్నారు. అంతేకాదు దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన మరికొందరు బెంగాల్ ప్రముఖుల చిత్రాలు ఇందులో ఉన్నాయని, ఈ శకటాన్ని తిరస్కరించి మొత్తం బెంగాల్ ప్రజలను కేంద్రం బాధకు గురి చేసిందని మమత విమర్శించారు. మొత్తం మీద ఈ అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడం చూశాక మమతతో రాజకీయ పోరాటం అంత తేలిక కాదని బీజేపీ పెద్దలకు అర్థమయ్యే ఉండాలి.