రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఊహాతీతమైన పనులు, నిర్ణయాలు అన్నీ కూడా రాజకీయాల్లో చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం వైసీపీలో ఇదే చర్చ సాగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి. వీటిలో వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, బీజేపీకి చెందిన టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, టీడీపీ టికెట్‌పై పెద్దల సభకు వెళ్లిన.. కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఉన్నారు. అయితే..ఈ నాలుగు స్థానాలు కూడా ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా .. ఇప్పుడు వైసీపీకే దక్కుతాయి.
అయితే.. ఆ నలుగురు ఎవరు ? అనేది ఇప్పటి వరకు వైసీపీ బయటకు చెప్పలేదు. కానీ, వీటిపై అనేక వార్తలు వస్తున్నాయి. వారిని పంపుతున్నారు.. వీరిని పంపుతున్నారు.. అని గ్యాసిప్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక విషయం వెలుగు చూసింది. పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి కి మళ్లీ రాజ్యసభనురెన్యువల్ చేయాలని.. సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం పార్లమెంటుస్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తనకు కలిసి వచ్చిన నగరంలో ఎంపీ అయి.. ప్రథాన ప్రతిపక్షంపై పైచేయిసాధించాలనేది సాయిరెడ్డి భావన.
అంతేకాదు.. దొడ్డిదారిలో రాజ్యసభకు వెళ్లారని.. ప్రజాబలం ఆయనకు లేదని.. తరచుగా వస్తున్న విమర్శ లకు కూడా చెక్ పెట్టాలని.. సాయిరెడ్డి అనుకుంటున్నారు. అయితే.. వాస్తవానికి వైసీపీకి రాజ్యసభలోను.. ఢిల్లీలోనూ కార్యక్రమాలు చక్కబెట్టడంలోనూ.. పార్టీలైన్ మేరకు ఢిల్లీలో చక్రం తిప్పడంలో సాయిరెడ్డి ముందున్నారు. సో.. ఇప్పుడు ఆయనకు రెన్యువల్ చేయకపోతే.. ఆ రేంజ్‌లో చక్రం తిప్పే నాయకుడు వైసీపీలేకుండా పోతారు. మరోవైపు పార్లమెంటు ఎన్నికలు జరగాలంటే.. రెండేళ్ల సమయం పడుతుంది. ఆయన అప్పుడు గెలిచి.. మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పేందుకు సమయం పడుతుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు సాయిరెడ్డి వదులుకునేందుకు సిద్ధపడ్డారని భావిస్తున్న రాజ్యసభ స్థానాన్ని కీలక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేటాయించేందుకు సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సజ్జల పార్టీ నాయకుడు మాత్రమే. ఆయనకు ప్రజాప్రతినిధిగా ఎలాంటి పదవీ లేదు. అయినప్పటికీ.. ప్రబుత్వ కార్యక్రమాలు, ఇతరత్రా కీలక విషయాల్లో ముందున్నారు. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలోను.. అనేక అంశాల్లో గళం వినిపించడంలోనూ.. కీలక రోల్ పోషిస్తున్నారు.
దీంతో ఆయనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయనకు ఏం అర్హత ఉందని.. ఈ విషయాలు చూస్తున్నారని.. విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఢిల్లీలో చక్రం తిప్పేందుకు, ఇటు రాష్ట్రంలో ఆయనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలుగా ఆయనను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని.. సీఎం అనుకుంటున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.