తగ్గేదే లే: ఉద్యోగులపై పంతం నెగ్గించుకున్న జగన్..

మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్న సామెత ఉంది.. మరి ఏకంగా మొండివాడే రాజైతే.. ఎలాఉంటుంది.. అది ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కారులా ఉంటుంది.. ఏపీలో ఉద్యోగులకూ.. ప్రభుత్వానికి మధ్య జగడం కొన్నాళ్లుగా నలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సెటిల్ అయ్యేవరకూ పాత జీతాలే ఇవ్వండి మహా ప్రభో అని ఉద్యోగ సంఘాలు మొత్తుకున్నాయి. ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. చరిత్రలో జీతాలు పెంచమని ఉద్యోగులు అడగటం చూశాం.. కానీ బాబూ.. పాత జీతాలే ఇవ్వు నాయనా అని అడిగే సీన్ మాత్రం ఇప్పుడే చూస్తున్నాం.


పాత జీతాల కోసం ఉద్యోగ సంఘాల నేతలు ఎంతగానో విన్నవించుకున్నారు. ఒత్తిడి చేశారు.. చివరకు జిల్లా ట్రెజరీ అధికారులకు మూకుమ్మడి లేఖలు రాశారు.. ట్రెజరీ ఉద్యోగులను సైతం పనికి వెళ్లకుండా ఆపేప్రయత్నం చేశారు. ఆలోపు సర్వర్‌ ఇబ్బంది పెట్టింది.. కానీ.. ఏది ఏమైనా తగ్గేదే లేదని జగన్ సర్కారు పంతం పట్టింది.. అందుకే.. జనవరి నెల వేతనాలు కొత్త వేతన స్కేలు ప్రకారం అమలయ్యాయి. కొత్త వేతన స్కేలు ప్రకారం జీతాలు ఇచ్చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడి తెలిపింది.

 
ఉద్యోగులు, పెన్షనర్లకు రివైజ్డ్‌ పే స్కేలు ప్రకారం చెల్లింపులు జరిపినట్టు ఆర్థిక శాక వివరించింది. ఉద్యోగులు తమ పే స్లిప్పులను ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు వేతనానికి సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు పంపించేశారట. సో.. ఉద్యోగులు ఎంత మొత్తుకున్నా జగన్ మాత్రం తన పంతమే నెగ్గించుకున్నారు. అయితే.. మరి కొత్త స్కేలు ప్రకారం.. ఎంత జీతం వచ్చింది.. ఎంత పెరిగింది.. ఎంత తగ్గింది.. డీఏలు ఎన్ని వచ్చాయి. మొత్తం జీతం ఎంత వచ్చిందన్న చర్చలు ఇక ఉద్యోగుల్లో మొదలవుతాయన్నమాట.


మరో వైపు ఏపీ సర్కారు ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచింది. ఇవాళ మధ్యాహ్నం మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఆహ్వానించింది. ఈ మేరకు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు.. అంటే ఉద్యోగ సంఘాల నేతలకు జీఏడీ కార్యదర్శి లేఖలు రాశారు. మరి ఈసారైనా ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తారా.. చర్చలు సాఫీగా సాగుతాయా.. ఈ ఉద్యోగుల పీఆర్సీ వివాదం జీడిపాకంలా సాగుతూనే ఉంటుందా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: