జగన్ ఐడియా అద్భుతం.. అమలైతే ఏపీకి ఆరోగ్యం..?
తీవ్రమైన వ్యాధులతో సూపర్ స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లే వారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇలా ఎంత కాలం ఒకరిపై ఆధారపడతాం.. అందుకే ఏపీలో మెడికల్ హబ్ లు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది. అయితే.. పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొల్పాలంటే చాలా ఖర్చుతో కూడిన పని.. అందుకే ఇందులో ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు పోవాలని జగన్ సర్కారు భావిస్తోంది.
మొత్తం 26 జిల్లాలలో 16 మెడికల్ హబ్‌లు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు ఆలోచన చేస్తోంది. 100 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసే ప్రైవేటు సంస్థలకు మున్సిపాలిటీ పరిధిలో 5 ఎకరాలు ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తోంది. మున్సిపాలిటీల్లో భూముల ధరలు బాగానే ఉంటాయి. అలాంటి చోట్ల ఏకంగా ఐదు ఎకరాల భూమి పూర్తి ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది.
ఈ మేరకు ఏపీ సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో ఆరోగ్య వసతులు కల్పించే సంస్థలు ఈ సుదుపాయాన్ని వాడుకోవచ్చని చెబుతోంది. ఇంత భారీ స్థాయిలో కాకపోయినా ఆరోగ్య వసతులు కల్పించే ఇతర సంస్థలకు కూడా అనేక విషయాల్లో రాయితీలు ఇస్తామని ప్రకటిస్తోంది. ఆయా సంస్థలు తమ ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చంటూ ఆహ్వానిస్తోంది. జగన్ సర్కారు ఐడియా అయితే బాగానే ఉంది. మరి ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.