ట్రోలింగ్‌ : జగన్‌ ముందు చేతులు జోడించిన చిరు..?

సినిమా పెద్దలు తమ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిన్న ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కొన్ని నెలలుగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. సినిమా టికెట్ రేట్లు తగ్గింపు, థియేటర్ల లైసెన్సులు, బెనిఫిట్‌ షోలకు అనుమతి నిరాకరణ.. ఇలాంటి విషయాలపై కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక పెద్ద సినిమాలకు ప్రత్యేక షోలు.. ప్రత్యేక టికెట్‌ రేట్లు కావాలన్న డిమాండ్ కూడా ఉంది.


ఈ సమస్యల గురించి చర్చించేందుకు నిన్న ఏపీ సీఎంతో సమావేశమైన సమయంలో చిరంజీవి సీఎం జగన్‌తో మాట్లాడిన వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. అందులో చిరంజీవి మాట్లాడిన మాటలు.. ఆయన మాట్లాడిన తీరు.. జగన్‌ను వేడుకున్న విధానంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ  జరుగుతోంది. “ సినిమా ఇండస్ట్రీపై తమరి చల్లని చూపు ఉండాలి.. తల్లి లాంటి పొజిషన్‌లో మీరు ఉన్నారు కాబట్టి.. మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం..అని చిరంజీవి చేతులు జోడించిన ప్రార్థిస్తున్నట్టుగా అడుగుతుంటే.. జగన్ చిద్విలాసంగా చేతులు కట్టుకుని చిరునవ్వుతో వింటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


చిరంజీవి హార్డ్‌ కోర్ ఫ్యాన్స్‌ కి ఇది కాస్త జీర్ణించుకోలేని అంశమే.. ఎక్కడి చిరంజీవి.. ఎలాంటి చిరంజీవి.. కొన్నేళ్ల క్రితం ఏపీ రాజకీయాలను శాసించాలన్న కలతో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవేనా ఈయన.. ఎన్నికల్లో దిగ్విజయంగా గెలిచిన సీఎం అవ్వాలని తాము కలలకు కన్న చిరంజీవేనా ఈయన.. అని అభిమానులు కచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు.


కానీ.. చిరంజీవికి ఆ బేషజాలు లేవు.. వాస్తవానికి ఆయన అంతగా ప్రాధేయపడి అడిగింది కూడా తన కోసం కాదు.. ఇంకా సినీరంగంలో చిరంజీవి సాధించాల్సినవి కూడా ఏమీ లేవు..కానీ చిరంజీవి అలా చేతులు జోడించి మరీ జగన్‌ను అడిగారంటే..అది సినీ పరిశ్రమ కోసం... పరిశ్రమపై ఆధారపడిన వేల కుటుంబాల కోసం.. నిజంగానే చిరంజీవి.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు.. సినీ పరిశ్రమ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా సిద్దమైన నిజమైన శ్రేయోభిలాషి చిరంజీవి. కాదంటారా..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: