చిన జీయర్‌ స్వామి, కేసీఆర్ మధ్య దూరం నిజమేనా..?

చిన జీయర్ స్వామి.. ఓ ఆధ్యాత్మిక వేత్త.. ఆయన ఓ ఆశ్రమం కూడా నడుపుతున్నారు. అయితే.. తెలంగాణ సీఎంగా కేసీఆర్ వచ్చాక చిన జీయర్ స్వామి రేంజ్‌ క్రమంగా పెరిగింది. ఎందుకంటే.. సీఎం కేసీఆర్‌కు స్వామీజీలు, పూజలు, యాగాలు అంటే నమ్మకం ఎక్కువ.. ఆ క్రమంలోనే ఆయన చినజీయర్ స్వామిని విపరీతంగా గౌరవిస్తారు.. సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టిన కొత్తలో సీఎం కేసీఆర్ ఏకంగా తన కుర్చీలో చిన జీయర్ స్వామిని కూర్చోబెట్టినట్టు కూడా ప్రచారం జరిగింది.


ఇక యాదాద్రి నిర్మాణం వంటి విషయాల్లో కేసీఆర్  చిన జీయర్ స్వామి సూచనల మేరకే ముందుకు వెళ్లారు.. ఆయనకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే.. మరో పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావుకు కూడా చిన జీయర్ స్వామి అంటే విపరీతమైన భక్తి.. ఈ పరిణామాలుతో చిన జీయర్ స్వామి ప్రభ  కొంతకాలంగా బాగా వెలిగిపోతోంది. ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన ముచ్చింతల్‌లోని రామానుజ భారీ విగ్రహ నిర్మాణం కూడా జూపల్లి రామేశ్వరరావు అండదండలతోనే పూర్తయిన సంగతి కూడా తెలిసిందే.. ఈ విగ్రహ నిర్మాణం, సహస్రాబ్ది వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది.


ఈ వేడుకల ఏర్పాట్లను ఉత్సవాల ప్రారంభానికి ముందు కూడా సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. అక్కడ వరకూ సీన్ బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. సీన్ మారిపోయింది. ఆ రోజు నుంచి కేసీఆర్ ఇప్పటి వరకూ ముచ్చింతల్‌ వైపు రాలేదు.. రామానుజ విగ్రహావిష్కరణ రోజు ప్రధాని వచ్చినా కేసీఆర్ మాత్రం రాలేదు.. అది ప్రధానిపై కోపం కావచ్చు అనుకున్నారు. కానీ ప్రధాని వెళ్లిన తర్వాత కూడా మొత్తం 14 రోజుల పాటు ఉత్సవాలు జరిగినా కేసీఆర్ హాజరు కాలేదు.


కేసీఆర్ మాత్రమే కాదు.. టీఆర్ఎస్ నేతలు కానీ మంత్రులు కానీ.. ముచ్చింతల్‌ వైపు చూడటం లేదు. ప్రధాని వచ్చిన రోజు శిలాఫలకంపై కేసీఆర్ పేరు లేకపోవడమే ఇందుకు కారణం అని ప్రచారం జరుగుతున్నా..అంత చిన్న కారణంతో కేసీఆర్ అంత కోపం పెంచుకుంటారా అన్నది నమ్మశక్యంగా లేదు.. మొత్తానికి ఏదో జరిగింది.. అదేమిటన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: