ఆనం టీడీపీ ఎంట్రీ... వైసీపీ ఫుల్ ఖుషీ...!

VUYYURU SUBHASH
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో సీనియర్ నేత. సుధీర్ఘ‌కాలం రాజ‌కీయాల్లో ఉన్న ఆనం ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీలో ఉన్నా తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదన్నది ఒక కారణమైతే తనకు వ్యతిరేకంగా వైసీపీలో కుట్ర జరుగుతుందని ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ద‌న ప‌డుతున్నారు. మ‌రోవైపు పార్టీలో ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అసంతృప్తి, అస‌మ్మ‌తి గ‌ళాన్ని వినిపిస్తున్నారు. ఇక తాజాగా ఆయ‌న అస‌మ్మ‌తికి మ‌రో విష‌యం దొరికింది. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలనికోరుతున్నారు. ఇది పేరుకు మాత్ర‌మే కోరుతున్నారు.. వాస్త‌వంగా ఆయన డిమాండ్ వేరే ఉందంటున్నారు.

ఆనం వైసీపీలో ఇమ‌డ లేక‌పోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ రాద‌ని కూడా తేలిపోయింది. ఈ క్రమంలోనే ఆయ‌న మ‌రోసారి టీడీపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆనం తెలుగుదేశం పార్టీ నుంచే గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేశారు. అప్పుడు ఆనంకు చంద్ర‌బాబు ఆత్మ‌కూరు టిక్కెట్ ఇచ్చారు. అయినా పార్టీలోకి రావ‌డంతో జ‌గ‌న్ వెంక‌ట‌గిరి సీటు ఇచ్చారు. వెంక‌ట‌గిరిలో ఆనం భారీ మెజార్టీతో గెలిచారు.

అయితే అప్పుడే ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశించినా జ‌గ‌న్ ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి ఆనం మ‌న‌సులో ఏదో పెట్టేసుకున్నారు. ఇక ఇప్పుడు టిక్కెట్ రాద‌న్న‌ది క్లారిటీ రావ‌డంతో ఆయ‌న టీడీపీ వైపు చూస్తున్నారు. టీడీపీలోకి వెళ్లినా ఆనంకు అక్క‌డ ప్ర‌యార్టీ ద‌క్కే అవ‌కాశాలు లేవు. జిల్లాలో టీడీపీ చాలా బ‌ల‌హీనంగా ఉంది. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి త‌ప్పా బ‌ల‌మైన నాయ‌కులు లేరు. పైగా ఆయ‌న కూడా ఇప్ప‌టికే ఐదు వ‌రుస ఓట‌ముల‌తో ఉన్నారు.

ఇక ఆనం టీడీపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌న్న వ్యాఖ్య‌ల‌పై నెల్లూరు జిల్లా వైసీపీ నేత‌లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆనం పీడ త‌మ‌కు వ‌దిలిపోతుంద‌ని వారు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఆనం పార్టీలో ఉండి పార్టీనే ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఇప్పుడు ఆయ‌న పార్టీ మారినా మాకేమి వ‌చ్చిన ఇబ్బంది లేద‌ని. జిల్లాలో వైసీపీ చాలా బ‌లంగా ఉంద‌ని.. త‌మ‌కు ఆనం పోతే మ‌రో ఐదారుగురు నాయ‌కులు రెడీగా ఉన్నారంటూ వైసీపీ వాళ్లు చ‌ర్చించుకుంటున్నారు. ఏతావాతా ఆనం టీడీపీలోకి వెళ్లినా అక్క‌డ ఆయ‌న‌కు ఒరిగేదేమి లేక‌పోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: