పవన్ టాక్: ఆ విషయంలో ఏపీ కంటే తెలంగాణ గ్రేట్..?
భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీ సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అధిక రేట్లకు టికెట్లు అమ్మకూడదని.. బెనిఫిట్ షోలు వేయకూడదని ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలు టెలీ కాన్ఫరెన్స్ పెట్టి మరీ తహశీల్దార్లకు ఆ బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. ఇది పరోక్షంగా పవన్ కల్యాణ్‌పై ఆర్థిక దాడి చేయడమే అన్న అభిప్రాయం ఉంది.
ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే విషయాన్ని పరోక్షంగా చెబుతున్నారు. ఇటీవల భీమ్లానాయక్ ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు కేటీఆర్ హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సినిమా రంగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. అంతే కాదు.. అసలు కళను అక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ కుల, మత భేదాలు ఉండవని మరోసారి తెలియజెప్పినందుకు కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు.
ఇదే సమయంలో రాజకీయ విమర్శలను కళలకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలోనే ఉందని తెలంగాణ నేతలకు కితాబిచ్చారు.. అదే సంస్కృతి కేటీఆర్‌లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుందని పవన్ కల్యాణ్ అభినందించారు. కేటీఆర్ బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్‌గేట్స్‌తో కీలకమైన వర్చువల్ సమావేశానికి సన్నద్ధమవుతూనే వీలు చేసుకుని భీమ్లానాయక్ విడుదల ముందస్తు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారని పవన్ కల్యాణ్ కేటీఆర్‌ను మెచ్చుకున్నారు. మొత్తానికి కళల విషయంలో సంకుచిత రాజకీయాలు చేసే ఏపీ కంటే.. తెలంగాణయే బెస్ట్ అని పవన్ కల్యాణ్ చెబుతున్నారన్నమాట.