యుద్ధం: ఎవరీ పుతిన్.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకే..?
అసలు ఎవరీ పుతిన్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆయన వ్యక్తిత‌్వం.. వ్యక్తిగత జీవితం ఏంటి.. ఓసారి చూద్దాం.. వ్లాదిమీర్ పుతిన్ 1952 అక్టోబరు 7న లెనిన్‌గ్రాడ్ లో జన్మించారు. అది ఇప్పుడు సెయింట్ పీటర్స్‌బర్గ్ గా మారింది. పుతిన్ కు మొదటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువ ఎక్కువ. అందుకే ఆయన జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఆయన చదువుకున్నది మాత్రం న్యాయ శాస్త్రం.. లా పూర్తి కాగానే పుతిన్ రష్యన్ గూఢచార సంస్థ కేజీబీలో చేరారు.
రష్యన్ గూఢచారిగా పుతిన్ తూర్పు జర్మనీలో పనిచేశారు. ఆ తర్వాత 1983లో ఆయన పెళ్లయింది. ల్యుడ్మిలాను వివాహం చేసుకున్నారు. అయితే 2013లో ఆయన ఆమెకు విడాకులు ఇచ్చారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో తన సొంత ప్రాంతం సెయింట్ పీటర్స్ బర్గ్‌కు డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆ తర్వాత 1997లో క్రెమ్లిన్‌లో ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ చీఫ్ అయ్యారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ రష్యా ప్రధాని పదవి కూడా అందుకున్నారు. 1999లో పుతిన్ తనను తాను రష్యా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
ఆ తర్వాత ఇక పుతిన్‌కు రష్యాలో ఎదురు లేకుండా పోయింది. 2000, 2004లో వరుసగా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ గెలిచారు. అయితే.. రష్యాలో ఏ వ్యక్తి కూడా వరుసగా రెండు సార్ల కంటే ఎక్కువగా ప్రెసిడెంట్ కాలేరు. అందుకే 2008లో మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అడ్డంకి అయ్యింది. అందుకే అప్పుు ఆయన ప్రెసిడెంట్ కాకుండా రష్యా ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ 2012, 2018లలో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలా పుతిన్ రాజకీయంగా ఎదురులేని నేతగా ఉన్నారు. అంటే దాదాపు 20 ఏళ్లుగా పుతిన్ రష్యాను శాసిస్తున్నారు. ఇంత సుదీర్ఘ కాలం ఓ దేశాన్ని శాసించడం అరుదు అనే చెప్పాలి.