రష్యా ఉక్రెయిన్ యుద్ధం: హమ్మయ్య..! పెను ప్రమాదం తప్పినట్టే..?

ఉక్రెయిన్ దేశంపై రెండు రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. దాడులు అంటే ఏవో సరిహద్దు అవతల ఉండి నాలుగు బాంబులు వేయడం కాదు.. ఏకంగా ఆ దేశంలోకి దూసుకుపోయి యుద్ధం చేయడం.. ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి చొచ్చుకుపోవడం.. ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలపై దాడి చేయడం..ఇలా రెచ్చి పోతూ రష్యా చివరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి సైతం అడుగు పెట్టింది. కీవ్ వీధుల్లో రష్యా సైనిక బలగాలు కవాతు చేస్తున్నాయి. ఈ దృశ్యం దేన్ని సూచిస్తుంది..?


పోరుగు దేశం సైన్యం.. ఆ దేశంలోకి చొరబడి రాజధానిలోనూ పాగా వేసిందంటే అర్థం ఏంటి.. ఇక ఆ దేశం ఓడిపోయినట్టేగా.. ఈ విషయం కనిపెచ్చిన ఉక్రెయిన్ బలగాలు.. తమ దేశాధ్యక్షుడిని ఎందుకైనా మంచిదని బంకర్లలో దాచేశాయి. అయితే.. అంతకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలకు ముందుకు రావాలని రష్యాను కోరాడు.. అవసరమైతే.. తాము నాటోలో చేరబోమని లిఖిత పూర్వకంగా రాసిస్తామని ఆఫర్ చేశాడు.. రష్యాకు ఉక్రెయిన్ తో ఉన్న గొడవంతా ఈ నాటో సభ్యత్వం గురించే కదా.. సరే. అని రష్యా కూడా ఓ ఆఫర్ ఇచ్చింది.. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు విడిచిపెడితే చర్చలకు సిద్దం అని ప్రకటించింది.


ఈ రెండు దేశాల ప్రకటనలు చూస్తే.. త్వరలోనే రష్యా,  ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అంటే యుద్ధం త్వరలోనే ముగియబోతోందన్నమాట. యుద్ధంలో చర్చలు అంటూ మొదలైతే.. ఎక్కడో ఒక చోట ఇరు వర్గాలు ఓ పరిష్కార మార్గాన్ని ఆమోదించే అవకాశం ఉంటుంది. రెండు వర్గాలు కాస్త తగ్గి.. ఒక ఒప్పందం కుదుర్చుకుంటే సమస్య పరిష్కారం అయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. రష్యా ప్రధాన డిమాండ్‌ అయినా నాటో సభ్యత్వం ప్రతిపాదనను విరమించుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నందువల్ల రెండు దేశాల మధ్య శాంతి నెలకొనడం పెద్ద కష్టమేమీ కానే కాదు.


తాజా పరిస్థితులు చూస్తే.. త్వరలోనే యుద్ధ మేఘాలు తొలగిపోయేలా ఉన్నాయి. అదే నిజమైతే ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. లేకుంటే.. ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎన్ని విపరిణామాలకు దారి తీస్తుందో అని ప్రపంచమే భయపడింది.. హమ్మయ్య క్రమంగా యుద్ధనీడలు తొలగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: