ఉ.10 గంటలకు కేసీఆర్ సంచలన ప్రకటన.. అంతటా టెన్షన్?
తెలంగాణ వచ్చాక అనేక రంగాల్లో అభివృద్ధి జరిగినా.. ఉద్యోగాల భర్తీ విషయంలో మాత్రం నిరుద్యోగులు ఊహించినంత పురోగతి లేదు. అందులోనూ గ్రూప్ వన్ వంటి కొన్ని ఉద్యోగాలు.. తెలంగాణ వచ్చిన8 ఏళ్ల తర్వాత కూడా ఇవ్వలేదు. తెలంగాణలో నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. గతంలోనూ ఇదిగో ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ సర్కారు నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వనేలేదు.
ఇక ఇప్పడు ఎన్నికలు క్రమంగా దగ్గరపడుతున్న సమయంలో నోటిఫికేషన్లు వస్తాయని అంతా ఎదురు చూస్తున్న సమయంలో కేసీఆర్ ఈ సంచలన ప్రకటన చేయడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే కేసీఆర్ తెలివిగా నిరుద్యోగుల అంశం అని చెప్పారు తప్ప విషయాన్ని లీక్ చేయలేదు. ఇది ఉద్యోగాల ప్రకటన గురించి అయి ఉంటుందా.. లేక నిరుద్యోగ భృతి వంటి అంశంపై సంచలన నిర్ణయం ఏమైనా తీసుకున్నారా అనేది మాత్రం అప్పుడే చెప్పేలని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో 70వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇటీవల వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 1,92,800 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలోని కొన్నింటిలో ఇప్పటికే ఒప్పంద, పొరుగు సేవల పద్ధతిన కొందరు పని చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ లక్ష ఉద్యోగాలు భర్తీపై ప్రకటన చేయవచ్చన్న అంచనా కూడా ఉంది. ఇంతకీ కేసీఆర్ ఏం ప్రకటిస్తారా అన్న దానిపై మాత్రం తీవ్ర ఉత్కంఠ ఉంది.