ఆశారేఖ: ఆ చీపురు ఈ దేశం మొత్తం శుభ్రం చేస్తుందా?
దీన్ని మార్చడం ఎలా.. దానికి సమాధానం కూడా ప్రజాస్వామ్యమే అని చెప్పింది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ. పేరుకు తగ్గట్టే ఇది సామాన్యుడి పార్టీ.. సామాన్యులను నేతలుగా మార్చిన పార్టీ. సామాన్యుడి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్న పార్టీ.. సమాజంలో మార్పు కోసం ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ చేపట్టిన ప్రయత్నం ఈ పార్టీ. ఆయన ప్రయత్నం విఫలం కాలేదు. రాజకీయాలను మార్చాలనుకునే మేధావులకు ఇండియాలో కొదువ లేదు. కానీ.. అందరూ అరవింద్ కేజ్రీవాల్‌లా విజయం సాధించలేరు.
రాజకీయానికి ప్రజాస్వామ్యతత్వాన్ని జోడించిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్.. సామాన్యుడి బాగు కోసం ఆయన పడే తపనే ఆయన్ను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. దేశం మొత్తాన్ని ఏలే బీజేపీని దేశ రాజధానిలో చిత్తు చిత్తుగా ఓడించింది. వరుసగా ఏడేళ్ల పాటు అధికారంలో కొనసాగుతోంది. దిల్లీలో ఏడేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దిల్లీలో కీలక అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నా.. ఉన్న పరిమిత అధికారంతోనే అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్లో నమ్మకం కలిగించాడు.
ఆ నమ్మకమే ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లోనూ ప్రతిఫలించింది. ఐదేళ్ల క్రితం పంజాబ్‌లో 20 ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రస్థానం ప్రారంభించిన ఆప్.. ఇప్పుడు సమూలంగా కాంగ్రెస్, శిరోమణి పార్టీలను పూర్తిగా ఊడ్చేసింది. దిల్లీ తర్వాత రెండో రాష్ట్రంగా పంజాబ్‌లో పాగా వేసింది. ఈ సందర్భంగా ఆప్ అధినేత మాట్లాడుతూ.. ఈ విప్లవం దేశమంతా తీసుకువస్తామన్నారు. నిజంగా అది సాకారం అవుతుందా.. ఆప్ క్రమంగా దేశమంతా విస్తరిస్తుందా.. చూడాలి.