పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతల మైండ్ గేమ్?
ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో పొత్తుకు సై అంటూ మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో సిగ్నల్ ఇచ్చేశాడు.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోను అని చెప్పడం ద్వారానే పొత్తుకు సిద్ధం అని చెప్పేశాడు. నిన్న మొన్నటి వరకూ పవన్ వెంట పడిన టీడీపీ నేతలు ఇప్పుడు పవన్ ఓకే అన్నాక సందిగ్దంలో పడిపోయారు. దానికి కారణం వచ్చే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటూ పవన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే.. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే.. టీడీపీతో కలసి అధికారం పంచుకుంటామని చెప్పినట్టే కదా.
అదిగో ఆ విషయమే ఇప్పుడు టీడీపీ నేతలను కలవర పెడుతోంది. పవన్ కల్యాణ్‌తో అధికారం పంచుకునేందుకు టీడీపీ నేతలకు అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే పొత్తుకు పవన్ సిద్ధం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసినా.. టీడీపీ మాత్రం ఆచి తూచి స్పందిస్తోంది. కొన్ని రోజుల తర్జన భర్జనల తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిగా తమ వాయిస్ బయటపెడుతున్నారు టీడీపీ నేతలు.
పవన్ కలసి వస్తే ఓకే కానీ.. అధికారం మాత్రం పంచుకునేది లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. పవన్ టీడీపీతో జత కడితే 160 సీట్లు వస్తాయని.. లేకపోతే.. 110 సీట్లు టీడీపీకే సింగిల్ గా వస్తాయని చెప్పడం ద్వారా పవన్ తమతో కలవకపోయినా అధికారం మాదే అని చెప్పకనే చెబుతున్నారు. మరి ఇక ఆలోచించుకోవాల్సింది పవన్ కల్యాణే.. అధికారం లేకపోయినా పర్వాలేదు.. జగన్‌ను ఓడించడమే లక్ష్యం అనుకుంటే ఆయన టీడీపీతో జత కట్టొచ్చు. లేదంటే కాస్త ఆలోచించుకోవాల్సిందే.