ఏపీ మంత్రి వర్గంలో ఆయనకు బెర్త్ పక్కా.. రాసి పెట్టుకోండి...!
వైసీపీలో మంత్రి వర్గ కూర్పు హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఉగాది నాటికి.. మంత్రి వర్గాన్ని మారుస్తారని.. అంటున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ రేసులో ఎవరు ఉంటారు? ఎవరు తప్పుకొంటారు.. ? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇటు మంత్రి వర్గ రేసులో ఎవరు ఉన్నా.. ఎవరు లేకున్నా.. ఒక కీలక నాయకుడికి మాత్రం ఇప్పటికే మంత్రి వర్గంలో చోటు ఖాయమైందనే వాదన వైసీపీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. ఆయన అవసరం ప్రబుత్వానికి చాలా ఉందని.. పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఆయనే ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటి వరకు ఆయన సలహాదారుగా ఉన్నారు. అయినప్పటికీ.. ప్రభుత్వ నిర్ణయాలు.. ఇతరత్రా.. అనేక విషయాల్లో.. సజ్జల కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు తెరమీదికి వచ్చినప్పుడు.. ఆయన వ్యవహరించిన తీరు.. పార్టీకి మేలు చేసింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఒడ్డున పడేసింది. ఇక, విపక్షాలు రెచ్చిపోవడం.. ప్రభుత్వంపై తీవ్రస్థా యిలో విమర్శలు చేయడం.. వంటి సందర్భాల్లో కూడా సజ్జల చాలా ఆచితూచివ్యవహరించడం.. సబ్జెక్టుల వారిగా.. వారికి కౌంటర్లు ఇవ్వడం తెలిసిందే.
అదేసమయంలో సీఎం జగన్‌కు సంబంధించిన అనేక వ్యవహారాలను ఆయన చాలా నిశితంగా చూస్తుండ డం.. ఎప్పటి నుంచో ఈ కుటుంబంతో సంబంధాలు ఉండడం వంటివి సజ్జల నేరుగా ప్రభుత్వ వ్యవహా రాల్లో జోక్యంచేసుకునేలా చేస్తున్నాయి.ఇక, వచ్చే ఎన్నికల్లో పార్టీకి అత్యంత కీలకమైన పరిస్థితి ఎదురు కానుంది. ఇటు ప్రభుత్వం నుంచి అటు పార్టీ నుంచి కీలకమైన వ్యవహారాలు చక్కబెట్టే నాయకుడు అవసరం.
ఈ క్రమంలోనే సజ్జలను పార్టీ నుంచే కాకుండా.. ప్రభుత్వం నుంచి మరింత బలమైన వాయిస్ వినిపించేలా చేయాలని.. జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ఒక క్లారిటీ ఉందని.. ఆయనకు మంత్రిపదవి కూడా ఖాయమైందని.. సీనియర్ల నుంచే వినిపిస్తుండడం గమననార్హం. అయితే.. పోర్టు ఫోలియో విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉందని చెబుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.