ఏప్రిల్ నుంచి కొత్త మంత్రులే కాదు.. కొత్త పాలన కూడా..!
ఇది రాష్ట్రానికి మంచి దశ, దిశను అందిస్తుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ఈ ఉగాది తర్వాత నుంచి కొత్త జిల్లాల్లో పాల న ప్రారంభం కానుంది. ఇక, మరో కీలక పరిణామం.. రాష్ట్రంలో మంత్రి వర్గం ఏర్పాటు. ఉగాది తర్వాత.. 11వ తేదీ నాడు.. కొత్త మంత్రి వర్గం కొలువుదీరనుంది. దీనిని ఎన్నికలను దృష్టిలోపెట్టుకునే చేస్తున్న ఏర్పాటుగా వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నా రు. అంటే.. పాలన పరంగా కీలకమైన నాయకులను ఈ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారు.
దీనిని బట్టి వచ్చే రెండేళ్ల కాలంలో పాలనలో మరింత వేగంతోపాటు.. మెరుపులు కూడా చూపించనున్నారనే వాదన బలపడుతోంది. ఇది ఒక విషయమైతే.. ఉగాది తర్వాత.. మరిన్ని కీలక పథకాలకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. గర్భిణులకు, చిన్నారులకు మరింత సేవలు అందించే క్రమంలో ఉగాది తర్వాత.. 500 లతల్లీ బిడ్డా ఎక్స్ప్రెస్ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే 108, 104 వాహనాలకు తోడుగా ఇవి పనిచేయనున్నాయి. అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్ మధ్య 6 లైన్ల రహదారికి కూడా ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్నారు.
ఇది కూడా అపూర్వఘట్టంగానే ప్రభుత్వం పేర్కొంటోంది. ఇక, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంటు పనులను కూడా ఏప్రిల్ నుంచి వేగం పెంచేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మరో కీలక పథకాన్ని కూడా ప్రకటించేందుకు జగన్ సర్కారు సిద్ధమవుతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మేనిఫెస్టోలో పేర్కొన్న దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు అవుతుందని అంటున్నారు. ఎలా చూసుకున్నా. ఏప్రిల్ అటు ప్రభుత్వానికి.. ఇటు రాష్ట్రానికి కూడా మేలు చేసే నెలగా పేర్కొంటున్నారు.