హైకోర్టు వర్సెస్ జగన్.. అఫిడవిట్‌తో మరింత ముదిరిందా?

ఏపీ రాజకీయం మరింత రసకందాయంలో పడుతోంది. ప్రత్యేకించి సీఎం జగన్, హైకోర్టు మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందేమో అన్న ఆందోళన కలుగుతోంది. ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు దాదాపు నెల రోజుల క్రితం సంచలనమైన తీర్పు ఇచ్చింది. అమరావతి రైతులకు నెల లోపు అభివృద్ధి చేసిన ప్లాట్లు అందించాలని తీర్పు చెప్పింది. అంతే కాదు.  ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. అంతేనా.. అసలు రాజధానిని మార్చడం కుదరదని.. ఆ అధికారం అసెంబ్లీకి లేదని తీర్పులో తేల్చి చెప్పేసింది.


ఈ మొత్తం వ్యవహారంపై ఈనెల 3 లోగా ప్రభుత్వం అఫిడవిట్ వేయాలని హైకోర్టు తన తీర్పులో ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై జగన్ సర్కారు ఏం చేసుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అసలే జగన్ కు రాజధానిగా అమరావతిని కొనసాగించడం ఇష్టం లేదు. కానీ.. హైకోర్టు తీర్పు మాత్రం అమరావతి రైతులకు అనుకూలంగా ఉంది. పోనీ.. సుప్రీంకోర్టుకు వెళ్దామా అంటే.. అక్కడ కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే ఏంచేయాలి.. అన్న మీమాంస కూడా ఉన్నట్టుంది.


మొత్తం మీద హైకోర్టు తీర్పుపై ఇప్పటి వరకూ సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. అలాగని హైకోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశ్యం కూడా జగన్ సర్కారుకు లేదు. అందుకే ఇప్పుడు జగన్ సర్కారు అఫిడవిట్ పేరుతో కాలయాపనకు ప్రయత్నిస్తోందన్న వాదన ఉంది. తాజాగా ఏపీ  హైకోర్టులో ఏపీ ప్రభుత్వం  ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.  సీఆర్డీఏ చట్టంలో పనులు పూర్తి చేసేందుకు మరో నాలుగేళ్లు సమయం పొడిగించామని ప్రభుత్వం ఈ అఫిడవిట్‌ లో తెలిపింది.


రాజధాని నిర్మించేందుకు హైకోర్టు ఇచ్చిన ఆరు నెలల గడువు ఏమాత్రం సరిపోదని.. తమకు 60 నెలల సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. అలాగే.. తమ ప్రాధాన్యం రాజధాని కాదని.. సంక్షేమమేనని.. రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్పచుకోవడం కష్టమని కూడా తన అఫిడవిట్‌ లో క్లారిటీగా చెప్పేసింది. అంతే కాదు.. హైకోర్టు  ఈ తీర్పుపై అప్పీల్‍కు వెళ్లాలా? లేదా?అనే అంశంపై అధ్యయనం  కొనసాగుతోందని కూడా ప్రభుత్వం తన అఫిడవిట్‌లో చెప్పిందట. అంటే.. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చినా.. తాను అమలు చేసే అవకాశమే లేదని జగన్ తేల్చి చెప్పినట్టు అవుతోంది. మరి హైకోర్టు ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: