సోనియా విందుకు వెళ్లిన టీడీపీ ఎంపీలు.. ఏంటి కథ?

తెలుగు దేశం పార్టీ ఎంపీలు తాజాగా దిల్లీలో జరిగిన ఓ రాజకీయ విందుకు హాజరయ్యారు. ఈ విందు డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ విందుకు ప్రధానంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు కావడం.. ఇదే విందుకు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కూడా వెళ్లడం ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది కూడా ఏమీ లేదు.


గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం కాంగ్రెస్‌తో దోస్తీ కట్టింది. దిల్లీ వెళ్లి మరీ అనేక సభల్లో కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు కూడా. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు కలలు కన్నారు. కానీ.. టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఆ కలలు కల్లలయ్యాయి. అయితే.. ఇప్పుడు జాతీయ స్థాయిలో టీడీపీ ఏ వైపు అంటే.. ఏ విషయం కూడా టీడీపీ నేతలే క్లారిటీగా చెప్పలేని పరిస్థితి.


ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అండ కోరుకుంటోంది. టీడీపీ, జనసేన విడిగా పోటీ చేస్తే వైసీపీని ఓడించడం కష్టం అని దాదాపుగా ఓ నిర్ణయానికి టీడీపీ వచ్చేసింది. కానీ.. జనసేనతో పొత్తు అంటే.. పవన్ కల్యాణ్‌ బీజేపీని కూడా కలుపుకుపోదాం అంటారు.. అలాంటప్పడు చంద్రబాబు ఇష్టం ఉన్నా లేకున్నా బీజేపీతో కూడా స్నేహం చేయాలి.. ఆమాటకొస్తే చంద్రబాబుకు బీజేపీ మరీ అంత అంటరాని పార్టీ కూడా ఏమీ కాదు కదా. గతంలో అధికారం పంచుకున్న అనుభవం కూడా ఉంది.


మరి ఈ పరిస్థితుల్లో సోనియా గాంధీ పాల్గొన్న విందులో టీడీపీ ఎంపీలు కూడా పాల్గొనడం చూస్తే కొంత ఆశ్చర్యం కలుగకమానదు. ఓవైపు బీజేపీ దేశమంతా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ కుచించుకుపోతోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్‌తో ప్రయాణం చేస్తే టీడీపీకి అది ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అన్నది ఆ పార్టీయే ఆలోచించుకోవాలి. మరి కాంగ్రెస్ వైపు మరోసారి చంద్రబాబు అడుగులు వేయడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందో.. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: