అమరావతి రైతుల దిల్లీయాత్ర వెనుక బీజేపీ ఉందా?
అమరావతి రైతులు, బహుజన నేతలు, దళిత జేఏసీ నేతలు.. ఇలా మొత్తం వంద మందికి పైగా దిల్లీలో ఉన్నారు. ఇంకా మరికొంత మంది దిల్లీ వెళ్ల నున్నారు. అమరావతిలో భూములు తీసుకున్న పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల ఉన్నతాధికారులను వీరు కలుస్తారట. ప్రధాని సహా... పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు వీరు సమయం కోరారట.
గత రెండేళ్లలో అమరావతిలో తమపై జరిగిన దాడులు, కేసులు పెట్టడం వంటి విషయాలను వీరు జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తారట. అలాగే ఎస్సి, ఎస్టీ కమిషన్, బిసి కమిషన్ లను కూడా కలిసిన ఫిర్యాదు చేస్తారట. అయితే వీరికి కేంద్ర మంత్రులు ఎంత వరకూ అపాయింట్ మెంట్ ఇస్తారో చూడాలి.. బీజేపీ కూడా అమరావతి ఉద్యమంలో పాలుపంచుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు వీరికి అపాయిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఒక వేళ వీరికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కూడా దొరికితే.. అది ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అమరావతిని అభివృద్ధి చేయలేను.. అందుకు నిధులు సరిపోవని ఇటీవల జగన్ సర్కారు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఈ నేపథ్యం కనీసం భూములు కొనుక్కున్న కేంద్ర సంస్థలైనా అమరావతిలో ప్రారంభించాలని వీరు కేంద్ర మంత్రులను కోరనున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన జీవిఎల్ నరసింహారావు కూడా కేంద్ర మంత్రులను కలిసి.. కేంద్ర సంస్థలను అమరావతిలో కార్యాలయాలు ప్రారంభించాలని చెబుతామని అన్నారు.