పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ మధ్య యుద్ధం తప్పదా?

ఓవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండగానే ఇప్పుడు మరో యుద్ధం భీకరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ మధ్య పూర్తి స్థాయి యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ అఫ్గానిస్తాన్‌ గ్రామాలపై రాకెట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. చర్చల ద్వారా కాకుండా ఇలా రాకెట్లతో సమస్యను ఎలా పరిష్కరించుకుంటారన్న వాదన వినిపిస్తోంది.


అయితే.. పాకిస్తాన్ దాడులపై అఫ్గానిస్తాన్‌ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. పాకిస్థాన్  వైమానిక దాడులపై స్పందించిన తాలిబన్ సర్కార్‌ ఆ దేశాన్ని తీవ్రంగా హెచ్చరించింది. అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఒక వేళ యుద్దానికి పాక్‌ సిద్ధమైతే తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని అఫ్గానిస్థాన్‌ మంత్రి జబివుల్లా ముజాహిద్ ఆ దేశాన్నికి హెచ్చరికలు జారీ చేశారు. అఫ్గానిస్తాన్‌ గ్రామాలపై పాక్‌ చేసిన వైమానిక దాడులను ఖండించిన జబివుల్లా... ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.


ఇలాంటి రాకెట్ దాడుల వంటి చర్యల వల్ల ఇరుదేశాల మధ్య వివాదాలు పెరుగుతాయని అఫ్గానిస్తాన్‌ హెచ్చరించింది. ఈ పరిస్థితి ఎవరికీ మంచిది కాదని హితవు పలికింది. చర్చలు, సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు అఫ్గానిస్తాన్‌ చెబుతోంది. ఈ మేరకు  కాబూల్‌లోని పాకిస్థాన్‌ రాయబారి మన్సూర్ అహ్మద్‌ ఖాన్‌ను తాలిబన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ పిలిపించి మాట్లాడింది. పాకిస్తాన్‌ నుంచి ముందు ముందు ఇలాంటి దాడులు జరగకుండా నిరోధించాలని అఫ్గానిస్తాన్‌ సూచించింది.


అయితే.. పాకిస్తాన్‌లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తమ సత్తా చాటటం ద్వారా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని కొత్త ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ భావిస్తే.. పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ఖోస్ట్, కునార్ ప్రావిన్సుల్లో నిర్వహించిన రాకెట్  దాడుల్లో 40 మందికిపైగా పౌరులు చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: