ప్లీజ్.. ఆ ఒక్క మాట మోడీని అడుగు పవన్?
జగన్ ప్రభుత్వం వైయస్ఆర్ రైతు భరోసా సాయం అందిస్తోందని.. కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడిసాయం అందిస్తోందని.. ఇలా అందిస్తున్న ఏకైక సీఎం వైయస్ జగన్ మాత్రమేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అంటున్నారు. అసలు పంట పెట్టుబడి సాయం అంటే ఏంటో పవన్ కల్యాణ్‌కు తెలుసా అని కన్నబాబు పవన్‌ను ప్రశ్నించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను వాడుకోవద్దని పవన్ కల్యాణ్‌కు కన్నబాబు సూచించారు. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు పెట్టుబడి సాయం రూ.67,500 వేలు ప్రతి రైతు కుటుంబానికి జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు.
ఇదే సమయలో వైసీపీ పవన్ పై ఎదురు దాడి చేస్తోంది. కౌలు రైతులకు బీజేపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించట్లేదని.. మరి ఈ విషయంపై ఆయన కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని కన్నబాబు విమర్శించారు. బీజేపీతో సయోధ్యలో ఉన్న పవన్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చెప్పి దేశవ్యాప్తంగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించొచ్చు కదా అని ప్రశ్నించారు. కేవలం జగన్ ప్రభుత్వం మాత్రమే ఈ దేశంలో కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తోందని గుర్తు చేశారు.
గత మూడేళ్లలో రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20,117 కోట్లు ఖాతాల్లో జమ చేశామని కన్నబాబు చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా మొత్తం 52.38 లక్షల రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందన్నారు. మరి పవన్ కల్యాణ్ ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తారా.. ఏమో..?