వారెవా: జగన్‌ను మెప్పించిన బెజవాడ పోలీసులు?
ఆ రోజు చలో విజయవాడ సభ చాలా సక్సస్ అయ్యింది. వేలాదిగా తరలివచ్చిన దృశ్యాలు టీవీ ఛానళ్లలో రోజంతా ప్లే అయ్యాయి. దీంతో సీఎం జగన్ కాస్త దిగిరాక తప్పలేదు. అసలు అప్పట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు జగన్ ఓ రేంజ్‌లో క్లాసు పీకారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే చలో విజయవాడ కార్యక్రమం జరిగిన కొన్నిరోజులకే జగన్ ముద్దుగా సవాంగన్నా అని పిలుచుకునే గౌతమ్ సవాంగ్‌ను డీజీపీ పదవి నుంచి తప్పించారు. అయితే.. ఆయన్ను కాస్త గౌరవంగానే ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను చేశారనుకోండి.
ఇప్పుడు మరోసారి అలాంటి దృశ్యమే పునరావృతం కాబోయింది. అప్పటి చలో విజయవాడ సక్సస్‌లో కీలక పాత్ర పోషించింది ఉపాధ్యాయులే.. అందుకే తాజాగా యూటీఎఫ్ నాయకులు సీపీఎస్ రద్దు డిమాండ్‌తో సీఎంవో కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇస్తే.. ప్రభుత్వం ఈ సారి కాస్త ముందుగానే మేల్కొంది. చలో విజయవాడ తరహాలో సీఎంఓ కార్యాలయ ముట్టడి సక్సస్ కాకూడదని గట్టి ఆదేశాలు ఇచ్చింది.
అటు బెజవాడ పోలీసులు కూడా ఈసారి బాగానే కష్టపడ్డారు. టీచర్ సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. డ్రోన్ కేమేరాలు, సీసీ కెమేరాల సాయం తీసుకున్నారు. మొత్తానికి యూటీఎఫ్ నేతలు సీఎంఓ దరిదాపులకూ కూడా రాకుండా అడ్డుకున్నారు. దీంతో సీఎంఓ ముట్టడి కార్యక్రమం విఫలమైంది. దీంతో హమ్మయ్య అని బెజవాడ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అలా మొత్తానికి బెజవాడ పోలీసులు జగన్ మెప్పు పొందారనే చెప్పాలి.