ఆ మీటింగ్‌పై కన్నేసిన జగన్, కేటీఆర్, బొమ్మై?
అదే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మే 22 నుంచి 26 వరకూ జరగనున్న ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు భలే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దావోస్ వేదికగా తమ రాష్ట్రాల్లో సాధించిన అభివృద్ధికి వివరించేందుకు వీరంతా ప్రజెంటేషన్లు సిద్ధం చేసుకుంటున్నారు. అవును.. దావోస్ సమావేశాలకు ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరు కాబోతున్నారట.
వీరితో పాటు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా ఈ దావోస్ సదస్సుకు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదండోయ్.. ఈ సదస్సుకు మన ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉందట. దావోస్‌లో 5రోజులపాటు జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి వందమంది సీఈవోలు రెడీగా ఉన్నారట. వీరే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే ఈ సదస్సు కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారట.
వాస్తవానికి ఈ దావోస్ సదస్సు ఈ జనవరిలోనే జరగాల్సి ఉంది. అయితే.. అప్పుట్లో ఒమిక్రాన్ వైరస్ ఓ ఊపు ఊపింది కదా.. అందువల్ల ఈ సదస్సును అప్పట్లో వాయిదా వేశారు. ఇప్పుడు కాస్త కరోనా గోల తగ్గింది కాబట్టి.. ఇంత కంటే ఆలస్యం చేస్తే మళ్లీ ఏం ముంచుకొస్తుందో అన్నట్టు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మరి ఈ సదస్సు ద్వారా వచ్చే పెట్టుబడుల సంగతేమో కానీ.. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదో పబ్లిసిటీ స్టంట్ అన్న విమర్శలు కూడా ఉన్నాయి.