టీడీపీ నేతలకు మేలు చేస్తున్న జగన్ సర్కార్‌..?

రాజకీయాల్లో పార్టీలు వేరు.. ప్రభుత్వాలు వేరు.. పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీయే ఉంటాయి. కార్యకర్తలు వేరుగా ఉంటారు. ఈ కార్యకర్తల మధ్య ఘర్షణలూ ఉంటాయి. కానీ ప్రభుత్వం అన్నది మాత్రం ఒకటే.. అది ఏ పార్టీవారికైనా ఒకటే.. ప్రభుత్వం అందరినీ సమంగా చూడాలి. అయితే.. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ కార్యకర్తలకు మేలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇదో రాజకీయ ఆనవాయితీగా మారింది. కానీ.. మేం మాత్రం టీడీపీ నేతలకు కూడా మేలు చేస్తున్నామంటున్నారు వైసీపీ నేతలు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల పైచిలుకు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందంటున్నారు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజు.



విశాఖ జిల్లాలో 1.26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన నిన్న సీఎంతో కలిసి ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, స్థానిక మాజీ శాసనసభ్యులు గత 5 సంవత్సరాల్లో పట్టుమని 5గురికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే అదీప్‌ రాజు విమర్శించారు. కానీ తాము మాత్రం  కేవలం పెందుర్తి నియోజకవర్గంలో రూరల్, అర్బన్‌ కలుపుకొని సుమారు 70 వేల మందికి మనం ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు.


తాము పట్టాలు ఇచ్చే వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారని ఎమెల్యే అంటున్నారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ సొంత గ్రామంలో టీడీపీ అధ్యక్షుడు భార్య గొంప సునీతకు కూడా పట్టా ఇచ్చామని ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. అలాగే టీడీపీ బీఫాంతో ఎంపీటీసీగా నామినేషన్‌ వేసిన వాడచీపురుపల్లి అభ్యర్థికి కూడా పట్టా ఇచ్చామని ఎమ్మెల్యే అదీప్‌రాజు గుర్తు చేశారు. 70 వేలు పట్టాలు..  అంటే ఇంటికి ముగ్గురు అనుకున్నా.. 2 లక్షల మందికి శాశ్వత నివాసం కల్పించామని ఎమ్మెల్యే అదీప్‌రాజు అంటున్నారు. చంద్రబాబు మాత్రం పేదల భూములు తీసుకొని రియలెస్టేట్‌ వ్యాపారం చేయాలని చూసారని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆ భూములను పేదలకు పంచి శాశ్వత నివాసాలు కల్పిస్తున్నారని పొగిడారు. అయితే.. ఎప్పుడో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని దుర్మార్గపు టీడీపీ కేసులు వేసి ఇన్నాళ్లూ అడ్డుకుందని ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: