అదే జరిగితే.. జగన్ దేవుడే కదా?
ఈ వివాదంపై రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వాదన వేరేగా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో నిర్వాసితులను బయటకు తరలించామని ఆమె చెబుతున్నారు. ఒకటి, రెండు గ్రామాలకు పునరావాస కాలనీ నిర్మాణాలు జరుగుతున్నాయని కూడా ధనలక్ష్మి చెబుతున్నారు. టీడీపీ పర్సంటేజీల కోసం కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసిన టీడీపీ నిర్వాసితుల గురించి పట్టించుకోలేదని ధనలక్ష్మి అన్నారు.
అయితే కొన్నిరోజులుగా టీడీపీ నేత వంతల రాజేశ్వరి ఈ అంశంపై దీక్ష చేస్తున్నారు. దీనిపై మండిపడిన ధనలక్ష్మి.. ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు నిర్వాసితుల తరఫున మాట్లాడుతున్నరని ప్రశ్నిస్తున్నారు. వైయస్ఆర్ సీపీలో గెలుపొంది టీడీపీకి అమ్ముడు పోయిన వంతల రాజేశ్వరి నిర్వాసితుల కోసం ఏం చేయలేదని ధనలక్ష్మి విమర్శించారు. అలాంటి వంతల రాజేశ్వరి ఇప్పుడు న్యాయపోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందని ధనలక్ష్మి అన్నారు. నిర్వాసితుల కోసం రాజేశ్వరి ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ధనలక్ష్మి సూచించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి కాలనీలకు తరలించామని ధనలక్ష్మి అన్నారు. పోలవరం నిర్వాసితులు అందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం వారి జీవితాలను త్యాగం చేసిన, పుట్టి పెరిగిన గ్రామాలను జ్ఞాపకాలను వదిలి వెళ్లిన వారికి ఎంత చేసిన తక్కువేనని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారని ధనలక్ష్మి గుర్తు చేసుకున్నారు.