దుల్హన్ ధోకా: ఇక ముస్లిం ఓట్లు జగన్‌కు దూరమేనా?
పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయాన్ని అందించేందుకు దుల్హన్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం గురించి జగన్ ప్రతిపక్షనేతగా అనేక హామీలు ఇచ్చారు. అంతే కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా సీఎం జగన్ పలుమార్లు ఈ పథకం గురించి గొప్పగా హామీలిచ్చారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ముస్లిం వర్గాలకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకాన్ని అమలు చేయలేకపోతున్నామని ప్రభుత్వమే హైకోర్టుకు తెలిపింది.
ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమానికి రూ. 1.60 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఇటీవల కాలంలో సీఎం జగన్ ఘనంగా చెప్పుకొచ్చారు. ఆయనే కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ చెప్పేది ఇదే.. ఇన్ని చెబుతున్నా పేద ముస్లిం యువతుల వివాహ సాయం విషయంలో డబ్బుల్లేవంటూ పక్కన పెట్టేయం ముస్లిం వర్గాలకు ఆగ్రహం కలిగించే అవకాశం ఉంది. వైసీపవీ అధికారంలోకి వచ్చాక.. 2019లో ఈ దుల్హన్ పథకానికిక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామని ఉత్తర్వులు కూడా ఇచ్చారు.
కానీ రాష్ట్రంలో ఎక్కడా ఈ పథకాన్ని అమలు చేయనేలేదు. గతంలో ముస్లిం యువతులకు పెళ్లి సమయంలో రూ. 25 వేల సాయం అందించేవారు. దీన్ని టీడీపీ 2015లో 50 వేలకు పెంచింది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వివాహాలకు సంబంధించిన పథకాలన్నీ ఒకే పథకంలో ఉండాలని దుల్హన్ పథకాన్ని చంద్రన్న పెళ్లికానుకలో కలిపేశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ముస్లిం యువతికి కూడా సాయం అందలేదు. ఇప్పుడు ఏకంగా ఇవ్వలేమని చేతులెత్తేయడం విమర్శల పాలవుతోంది. మరి దీని ప్రభావం వైసీపీకి ముస్లింల ఓట్లు పడటంపై ఎంత వరకూ ఉంటుందో?