ఏపీకి మరో గౌరవం.. తిరుపతిలో కార్మిక మథనం?

తిరుపతి వేదికగా రెండు రోజుల పాటు జాతీయ కార్మిక సదస్సు జరిగింది. కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖల కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి అధ్యక్షతన 25న ప్రారంభమైన ఈ సదస్సును కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రారంభించారు. దేశంలోని 25 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కార్మిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. సదస్సు తొలి రోజున ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు.  

రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో నాలుగు బృందాలుగా ఏర్పడి దేశంలోని కార్మిక చట్టాలు, వాటి అమలు తీరు, చేపట్టాల్సిన సవరణలపై చర్చించారు.  జాతీయ కార్మిక సదస్సు ముగింపు సమావేశానికి ముందు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ హాజరయ్యారు. భారతదేశంలో అసంఘటిత కార్మికుల సమస్య పరిష్కారం కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మధ్య సమన్వయం అవసరమని భావించి ఈ సదస్సును ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. సదస్సు విజయవంతమైందని, కార్మికులకు సార్వత్రిక సామాజిక రక్షణ, ఉపాధి అవకాశాల పెంపు, ఈ -శ్రమ్‌ పోర్టల్‌ ఏకీకరణ వంటి అంశాలపై చర్చసాగిందని కార్మికులకు అనుకూలమైన అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు.

కార్మిక చట్టాలపై  రెండు రోజులుగా తిరుపతిలో జరిపిన  మేథోమధన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ హాజరయ్యారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయన్నారు. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి జగన్  అన్నారు. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఇది ఏపీకి గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి  భూపేంద్రయాదవ్‌కి సీఎం జగన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సదస్సులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని సీఎం జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: