ఆ ఇష్యూ జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారిందిగా?
ఎంత చిత్తుశుద్ధితో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రయత్నించినా.. కొన్ని అంశాలు మాత్రం చేయడం చాలా కష్టసాధ్యంగా మారుతుంది. ఇప్పుడు జగన్ విషయంలో అదే జరుగుతోంది. ఆయన ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. అయితే.. ఇచ్చిన హామీల్లో దాదాపు 95 శాతం ఇప్పటికే అమలు చేశామని వైసీపీ సర్కారు చెప్పుకుంటోంది. కానీ.. ఓ ఐదు శాతం హామీలు మాత్రం ఇంకా అమలు చేయలేకపోతున్నామని వైసీపీ మంత్రులే ఒప్పుకుంటున్నారు.
అలా అమలు చేయలేకపోయిన హామీల్లో ముఖ్యమైంది.. కీలకమైంది సీపీఎస్ రద్దు హామీ.. తాను అధికారంలోకి వస్తే.. వారం రోజుల్లో సీపీఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేస్తానని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక లెక్కలు వేసి చూస్తే.. ఈ హామీ అమలు చేయడం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ వల్ల కాదని తేలిపోయింది.
అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని ఉద్యోగులకు ఎలా సర్ధి చెప్పాలి.. వారికి అనుకూలంగా మధ్యే మార్గంగా ఎలాంటి పథకాన్ని అమలు చేయాలి.. అనే అంశంపై వైసీపీ మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు మేలు చేసేలా సీపీఎస్ బదులు జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. కానీ.. దీనికి కూడా ఉద్యోగులు ఒప్పుకోవడం లేదు. మరి ఈ సమస్యను జగన్ ఎలా పరిష్కరిస్తారో ఏమో.