జగన్ అంతు చూడాలని.. ఆ నలుగురి పంతం?

ఏపీలో ఆ నలుగురు జగన్ అంతు చూడాలని ప్రయత్నిస్తున్నారట. ఇంతకీ ఆ నలుగురు ఎవరు.. ఇంకెవరు.. ఎల్లో మీడియా అధిపతులట.. ఈ విషయాన్ని జగన్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ఈ విషయం సాక్షాత్తూ జగనే చెప్పాడట..  అవతల శక్తులు మామూలుగా లేవని... మన అంతుచూడాలనో, ప్రజల్ని పక్కదారి పట్టించాలనో అభూత కల్పనలతో వాళ్లు సమన్వయంలో నలుగురూ కూడబలుక్కుని అపోహలు క్రియేట్‌ చేస్తున్నారని జగన్ హెచ్చరించారట.


మీరంతా జాగ్రత్తగా ఉండండని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌ హెచ్చరించినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పారదర్శకంగా ఉండండి... వాళ్లు మారీచులు.. అని సీఎం గారు చెప్తే దాన్ని కూడా ఆ నలుగురు తిరగేసి రాతలు రాశారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. అవినీతికి దూరంగా ఉండండి అని సిఎం చేప్తే.. ఇకపై అవినీతికి దూరంగా ఉండండి అని చెప్పినట్లుగా ఆ నలుగురు రాతలు రాస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంటే ఇప్పటి వరకూ అవినీతికి పాల్పడ్డట్లు అర్ధం వచ్చేలా వారు వార్తలు రాస్తున్నారట.


తప్పుడు ప్రచారంలో ఎల్లో మీడియాకు చెందిన- ఒక్కో చానల్‌ వాళ్లు ఒక్కో విధంగా క్రెడిట్ల కోసం పోటీ బడ్డారని... మమ్మల్ని చూసి జాగ్రత్తగా ఉండమని సిఎం చెప్పాడు అంటూ ఎవరికి వారు పోటీ పడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరికి వారు జబ్బలు చరుచుకున్నారని... అసలు ఇదేమైనా ఒక బాధ్యతాయుతమైన మీడియానేనా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మేం ఏం చేసినా జనం నమ్ముతారని.. అని అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.


అసలు జగన్మోహన్‌రెడ్డి గారు తప్పు చేయడానికి ఎక్కడ అవకాశం ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గతంలోలా జన్మభూమి కమిటీలు పెట్టి దోపిడీకి దారులు తెరవలేదని... ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రూపాయిలో 80పైసలు టీడీపీ హయాంలో పక్కదోవ పట్టిందని... లక్ష మందిలో ఒక వంద మందికి అర్హత లేక ఏదన్నా రాకపోతే వారినే లక్షమంది అన్నట్లుగా ఇప్పుడు చూపిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: