పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ప్రస్తుతం కొన్ని అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వస్తున్న వారు చాలా మంది ఉంటున్నారు. వారు టీడీపీ వైపు చూస్తున్నారు. కానీ జనసేన పేరు కూడా ఎత్తడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారు, గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఉన్నా అక్కడ అవకాశం లేని వారిని పవన్ దగ్గరకు తీసుకుంటే ఆయనకు ఏమైనా కలిసొచ్చే అవకాశం ఉంటుందేమో.
పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకోరు.. జగన్ ని, చంద్రబాబుని కూడా అందరూ కోరుకోరు. కానీ జగన్, చంద్రబాబులకు ప్రత్యామ్నాయంగా మాత్రం పవన్ ని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక అద్బుతమైన వాతావరణం నెలకొంది. బయట పార్టీల నుంచి బయటకు వస్తున్న వారిని రాజకీయంగా తామున్నామంటూ వారికి భరోసా ఇవ్వగలగాలి. మేమున్నాం అంటూ దరికి చేర్చుకుంటే వారితో పాటు పార్టీకి కాస్త బలం పెరుగుతుంది.
ప్రజలు చంద్రబాబును సీఎంగా 14 సంవత్సరాలు చూశారు. సీఎంగా జగన్ ను మూడున్నరేళ్లుగా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను పవన్ కళ్యాన్ క్యాష్ చేసుకోవాలి. మూడో ప్రత్యామ్నాయంగా పవన్ ప్రజలకు కనిపించాలి. అది ఇక్కడ జరగడం లేదు. భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేస్తానని పవన్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కలిసి వీరు బహిరంగ సభ పెట్టినట్లు కనిపించ లేదు. మరో పక్క టీడీపీతో కలిసి పని చేస్తానని ప్రకటిస్తున్నారు.
రాజకీయాల్లో సందిగ్దత అంటే తెలియక అమోమయం, అసందిగ్దత అంటే తెలిసి తెలియనట్లు ఉండటం ప్రస్తుతం పవన్ పూర్తిగా అసందిగ్దత లో ఉన్నారని చెప్పొచ్చు. అవకాశాలు అయితే పదే పదే రావు. వచ్చినపుడే దాాన్ని సద్వినియోగం చేసుకొని అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. పవన్ తన ఆశయాన్ని నెరవేర్చుకుంటారా? లేక మళ్లీ బోల్తా పడతారా చూడాలి.