టార్గెట్ మహారాష్ట్ర: కేసీఆర్ ప్లాన్ ఇదేనా?
తాజాగా మహారాష్ట్రకు 600 కార్లతో సీఎం కేసీఆర్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ శరద్ పవార్ స్థానాన్ని కేసీఆర్ ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ స్థానాన్ని ఆయన సోదరుడు అజిత్ పవార్ భర్తీ చేసేలా లేడు. కూతురు ఎంపీ అయినా ఆమె ప్రాభవం కూడా తక్కువే అని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే లాంటి వారు సైతం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మహా అఘాడీ వికాస్ అని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే నిలబడినా.. ఆ ప్రభుత్వం ఎన్నో రోజులు కొనసాగలేదు. తర్వాత బీజేపీ సర్కారు తమ ఆధిపత్యాన్ని చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది.
అయితే ఇప్పుడు అక్కడ సరైన నేత కనిపించడం లేదు. శరద్ పవార్ తర్వాత అంతటి నేత లేడని ఆ స్థానాన్ని భర్తీ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నాడు. ఒకప్పుడు వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు కేసీఆర్ మూడో స్థానానికి పరిమితం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లది కూడా తెలంగాణలో అలాంటి పరిస్థితే. కాబట్టి తెలంగాణలో తిరుగు లేదు. కేటీఆర్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టి సారించి అక్కడ పాగా వేయాలని పెద్ద ప్లాన్ వేసినట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.