బండి ఔట్.. కేసీఆర్కు మోడీ మహా మేలు చేశారా?
బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనే విధంగా పోరాటం చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. గుర్రం పోడు భూ వివాదం, నేరేళ్ల ఘటన, కరీంనగర్ లో ఉపాధ్యాయ దీక్ష, ప్రజా సంగ్రామ యాత్ర, ఇలా అనేక రకాల కార్యక్రమాలతో దూసుకుపోయారు. బీఆర్ఎస్ తర్వాత బీజేపీ అనేలా ప్రజల్లోకి వెళ్లిపోయారు. ఒకానొక సమయంలో బీజేపీ తెలంగాణలో మొదటి స్థానంలోకి వచ్చేసినట్లే కనిపించింది.
కానీ మూడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఇంత తొందరగా బీజేపీ బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డిని నియమించడం అనేది తప్పుడు నిర్ణయమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ కూటమి వైపు ఇతరులు చూస్తారు. కేంద్రంలో ఎలాగైనా బీజేపీ గెలవాలని ఆశిస్తోంది. ఇక్కడ బీజేపీ గెలిచినా గెలవకున్నా కేంద్రంలో బీజేపీ గెలవాలనేది వారి ఆకాంక్ష.
ఒక వేళ బీజేపీకి సీట్లు తగ్గితే తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలు సపోర్టు చేసే అవకాశం ఉంటుంది. అదే ఆంధ్రలో టీడీపీ గెలిచినా.. వైసీపీ గెలిచినా బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి బీజేపీ తెలంగాణలో సరి కొత్త వ్యూహంతో ముందుకెళుతుంది. కానీ బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డికి పగ్గాలు ఇవ్వడం వల్ల డైరెక్టుగా బీజేపీ నాయకులే చాలా మంది విమర్శిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని బీఆర్ఎస్ కు మార్గం సుగమం చేయడమే అని అభిప్రాయపడుతున్నారు