జగన్, పవన్, బాబు.. ఎన్నికల అజెండాలు ఫిక్స్?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసేస్తామని కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. అంటే కొన్ని వ్యవస్థల అవసరం లేదని దాని వల్ల ప్రజలకు నష్టం జరుగుతందని ప్రజల డేటాను ప్రభుత్వం అమ్ముకుంటుందని అంటున్నారు. ఇలా డైరెక్టుగానే జనసేన అధినేత ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన మరెన్ని ఆరోపణలు చేస్తారో చూడాలి.
మరో వైపు టీడీపీ వ్యుహాత్మకంగా అడుగులు వేయాలని ప్రయత్నం చేస్తోంది. ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని అనుకుంటోంది. వైసీపీ ప్రవేశపెట్టిన పథకాల్లో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే వారు తెచ్చిన కొన్ని పథకాల్లో మార్పులు చేసి వాటిని కొనసాగిస్తామని చెబుతోంది. ఇలా చెప్పడం వల్ల పథకాలను మొత్తానికే తీసేయడం లేదని సంకేతాలు ఇస్తుంది. దీని వల్ల లబ్ధి పొందుతున్న చాలా మంది టీడీపీ వస్తే నష్టమేమీ లేదనే భావనతో అనుకూలంగా ఓటు వేస్తారని ప్లాన్ చేస్తోంది.
అధికార పక్షం వైసీపీ మాత్రం తాను ప్రవేశ పెట్టిన పథకాలే గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు. విశాఖ రాజధానితో పాటు అమ్మ ఒడి, నాడు నేడు లాంటి అనేక పథకాలు కొనసాగిస్తామని, నవరత్నాల్లో ఏడింటిని పూర్తిగా అమలు చేశామని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన, మద్య పాన నిషేధం లాంటి వాటిపై సరైన ప్లాన్ తో వెళ్లి ప్రజలకు మరింత దగ్గర కావాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎవరి దారిలో వారు అజెండా మాత్రం ఫిక్స్ చేసుకున్నట్లే కనిపిస్తోంది.