హమాస్.. అమాయకులను అడ్డుపెట్టుకుంటోందా?
ప్రపంచానికి మాత్రం ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై దాడులు చేసి అమాయక ప్రజలను బలితీసుకొంటుందని అరబ్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే వీటిని లెక్క చేయకుండా ఇజ్రాయెల్ తమ పని తాము చేసుకొని పోతుంది. గాజా నగరంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫా ఆసుపత్రి కింద హమాస్ ప్రధాన కార్యాలయం ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా డజన్ల కొద్దీ ఇజ్రాయెలీ సైనికులు గాల్లోకి కాల్పులు జరుపుతూ అల్ షిఫా లోకి ప్రవేశించారు.
లోపలకి వెళ్లగానే 16ఏళ్లకు పైబడిన పురుషులంతా చేతులు పైకత్తాలని అరబిక్ భాషలో ఇజ్రాయెలీ సైనికులు లౌడ్ స్పీకర్ ద్వారా ప్రకటన చేశారు. ఎత్తిన వారిని ఆసుపత్రి ప్రధాన ద్వారం గుండా బయటకి పంపిచారు. అనంతరం హమాస్ మిలిటెంట్ల కోసం ఆసుపత్రి మొత్తం జల్లెడ పట్టారు. ఆసుపత్రి ప్రధాన అత్యవసర విభాగం, ఇతర వార్డులను దేన్నీ వదలకుండా మొత్తం తనిఖీ చేశారు.
అయితే ఆసుపత్రిలో నవజాతి శిశువులతో సహా వేలాది మంది రోగులపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఐక్యరాజ్యసమితి, మధ్య ప్రాచ్య దేశాలు ఖండించిన నేపథ్యంలో ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనెడ్లు, మందుగుండు సామగ్రి, ప్లాక్ జాకెట్లను ఆసుపత్రి కాంప్లెక్స్ నందు స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వీడియోలో చూపింది. హమాస్ తీవ్రవాదులు అమాయక ప్రజలను అడ్డుపెట్టుకొని తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని వీడియో సాక్ష్యంగా బయట పెట్టింది. మరోవైపు పసికందులుకు ఇంక్యూబేటర్లు బేబీ ఫుడ్, మందులు అందజేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.