అక్రమ సంబంధం.. సహజీవనం ఒకటే కాదా?
అసలు విషయం ఏమిటంటే.. పంజాబ్ కి చెందిన ఒక జంట కొంత కాలం నుంచి సహజీవనం చేస్తోంది. యువతి అవివాహితురాలైనా.. పురుషుడికి మాత్రం పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రియురాలి విషయంలో భార్యతో విభేదాలు తలెత్తడంతో ఆమెను వదిలేసి ప్రియురాలితో ఉంటున్నారు. అయితే ప్రియురాలి కుటుంబ సభ్యులు మాత్రం వీరి బంధాన్ని అంగీకరించలేదు. పెళ్లైన వ్యక్తితో సహజీవనం ఏంటని ప్రశ్నించారు. తిరిగి ఇంటికి రమ్మని ఒత్తిడి చేశారు. దీంతో ఆ జంట తమకు రక్షణ కల్పించాలని హైకోర్టుని ఆశ్రయించింది.
తామిద్దరం సహజీవనం చేస్తున్నామని కానీ అమ్మాయి కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని పిటిషన్ లో పేర్కొంది. తమకు రక్షణతో పాటు స్వేచ్ఛను కల్పించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు పురుషుడికి పెళ్లై.. పిల్లలున్నారని.. అయితే విడాకులు తీసుకోలేదని తేలింది. దీంతో వీరి బంధాన్ని సహజీవనం గా పరిగణించలేం అని పేర్కొంది.
పురుషుడు విడాకులు తీసుకోకుండా అమ్మాయితో కామంతో కూడిన వ్యభిచార జీవితాన్ని గడుపుతున్నాడని ఆక్షేపించింది. ఐసీసీ సెక్షన్ 494/495 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరంగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. వ్యభిచారం కేసులో విచారణను తప్పించుకునేందుకు ఈ పిటిషన్ వేసినట్లు ఉందని.. వారికి ఉపశమనం కల్పించేందుకు నిర్దిష్ట కారణాలు కనిపించడం లేదని వారి పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొంతమందికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని న్యాయ నిపుణులు అంటున్నారు.