తెలంగాణ రణరంగంలోకి బీజేపీ బడా నేతలు?
ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ముగింపు దశకు రావడంతో వారంతా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంగా గాంధీ, మల్లికార్జున ఖర్గే , ఆ పార్టీ సీఎంలు రాష్ట్రానికి రానున్నారు. తమకు సానుకూల వాతావరణ ఏర్పడిందని చెప్తున్న కాంగ్రెస్ ప్రచారాన్ని సైతం ఉద్ధృతం చేసింది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజుకు నాలుగైదు సభల్లో పాల్గొంటూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ కూడా ప్రచారంలో ముందుంది. అందరికంటే అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించడంతో వారంతా నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇప్పుడు గులాబీ బాస్ రోజుకు మూడు, నాలుగు చొప్పున ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలను గుర్తించి కేటీఆర్, హరీశ్ రావులు అక్కడ వాలి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
బీజేపీ విషయానికొస్తే ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు పర్యటించారు. ప్రచారాన్ని విస్త్రృతపరిచేందుకు కాషాయ దళం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా అమిత్ షా గద్వాల, నల్గొండ, వరంగల్ సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో మ్యానిఫెస్టో విడుదల చేశారు. మరోవైపు మిగతా ఐదు రోజుల్లో సుమారు 50 సభలకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రచారానికి ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, యోగీ ఆదిత్యానాధ్, హిమంత బిశ్వశర్మ, ఏక్ నాథ్ షిండే లు రానున్నారు. వీరంతా ఆ పార్టీ ప్రభావం చూపగలిగే స్థానాల్లో మాత్రమే ప్రచారం నిర్వహించి అభ్యర్థులు గెలుపు కోసం యత్నిస్తున్నారు.