తెలంగాణలో జనసేనతో పోరాడుతున్న టీడీపీ?
ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన తర్వాత చంద్రబాబు వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి అనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. అయితే ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ తెలంగాణలో మాత్రం ఎవరికి మద్దతు తెలపడం లేదు. పలు చోట్ల టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కి మద్దతు ప్రకటిస్తున్నా పార్టీ అధినాయకత్వం మాత్రం ఏం మాట్లాడటం లేదు.
మరోవైపు ఏపీలో జనసేన తమకు మద్దతిచ్చి కష్టకాలంలో అండగా నిలబడ్డారని టీడీపీ నేతలు నారా లోకేశ్, భువనేశ్వరి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిఫలంగా అయినా తెలంగాణలో జనసేన అభ్యర్థులకు ఓటేయమని టీడీపీ కోరడం లేదు. మరోవైపు జనసేన కు మద్దతు విషయంలో టీడీపీ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
ఏపీలో టీడీపీని బీజేపీ దూరం పెడుతోంది. ఇదే సందర్భంలో వైసీపీకి అనుకూలంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యవహరిస్తోంది. పోనీ జనసేనకు మాత్రం మద్దతు ఇస్తామని చెప్పి బీజేపీని దూరం చేసే సాహసం టీడీపీ చేయలేకపోతుంది. ఎందుకంటే ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన కూటమికి కేంద్రం సపోర్టు కావాలి. తెలంగాణ ఎన్నికల బరి నుంచి పూర్తిగా తప్పుకోవాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మరోవైపు టీడీపీ మద్దతును ఇటు బీజేపీ కానీ.. అటు జనసేన కానీ బహిరంగంగా కోరలేదు. కాబట్టి దీనిపై టీడీపీ తమ స్పష్టమైన వైఖరి తెలియజేయలేదు.