జగన్, బాబు, పవన్.. ముగ్గురిలో బలవంతుడెవరు?
అయితే టీడీపీతో కలిసేందుకు బీజేపీ సుముఖంగా లేదు. మరోవైపు వైసీపీ మరో సారి సింగిల్ గానే పోటీకి వెళ్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తోంది. ఏది ఏమైనా మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని పావులు కదుపుతోంది. అందులో భాగంగానే జగన్ తన దగ్గర వారికి సైతం టికెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని వార్తలు బయటకు వస్తున్నాయి.
అయితే వ్యూహాల్లో చంద్రబాబు, జగన్ ఎవరికి వారే దిట్ట. ఇద్దరికీ బలాలు ఉన్నాయి. బలహీనతలు ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా జగన్ కూడా ఎమ్మెల్యేలను కలవడు, ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది. మరోవైపు రాజకీయ కక్షలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వరు. తమకు ఏం లబ్ధి చేకూరింది అనే విషయంపైనే ఆలోచిస్తారు. చంద్రబాబుని అరెస్టు చేయడం వల్ల జగన్ సాధించింది ఏంటి. ఇంకా చంద్రబాబుకే కొంత సానుభూతి లభించినట్లయింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం వల్ల వారంతా పార్టీ మారితే వైసీపీలో క్యాడర్ గందరగోళానికి గురవుతుంది. పార్టీ అభ్యర్థులను మార్చితే వ్యతిరేకత కొంతమేర తగ్గి తన సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని జగన్ భావిస్తున్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందని గడప లేదు. అయినా గ్రామీణ ప్రాంత ఓటర్లంతా బీఆర్ఎస్ ను వ్యతిరేకించారు. అందువల్ల ఓటరు నాడి పట్టుకోవడం చాలా కష్టం. టీడీపీ జనసేన కూటమి క్షేత్ర స్థాయిలో ఈ మేరకు ప్రభావం చూపుతుందో దానిపైనే ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఏపీలో ప్రస్తుతం ఎవరూ బలవంతులు కాదు. ఎవరూ బలహీనులు కాదు. ఇద్దరూ సమ ఉజ్జీలే.