ముచ్చటగా మూడోసారీ మోదీనే ప్రధాని?
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మూడు చోట్ల విజయం సాధించింది. మధ్యప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకోగా.. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుంది. సార్వత్రికానికి ముందు సెమీ ఫైనల్ గా భావించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీ ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది. మరోవైపు సర్వేలు కూడా కాషాయ పార్టీకి అనుకూలంగా తీర్పును ఇస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రధాన మంత్రిగా తన మూడోసారి ఇన్నింగ్స్ లో మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. తద్వారా వరుసగా మూడోసారి ప్రధాని గా ఎన్నికవుతారని పరోక్షంగా తేల్చి చెప్పారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నాయకుడు ఎన్నికల సంగ్రామంలోకి చాలా ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాలని ప్రధాని అదే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ మాట్లాడుతూ ఓడిస్తే ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాం అన్నారు. మరోవైపు కేటీఆర్ కూడా ప్రతి రాజకీయ పార్టీకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాల్లో వీరు నైరాశ్యంలో ఉన్నట్లు ప్రజలు భావిస్తారు. ఒకవైపు ప్రధాని నేనే అని చెబుతూనే మరోవైపు ఇండియా కూటమి తరఫున ప్రధాని ఎవరు అన్ని ప్రశ్నించినట్లు అవుతుంది. ప్రధాని మోదీ ప్రజాదరణ ఇంకా తగ్గలేదని మూడు రాష్ట్రాల ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది. మరోసారి నన్ను చూసి ఓటు వేయండి ప్రధాని చెప్పకనే చెప్పినట్లే అవుతుంది.