జగన్ పై ఆ వర్గంలో వ్యతిరేకత కొంప ముంచేనా?
అయితే జగన్ మాత్రం తెలంగాణ లెక్కలను బేరీజు వేసుకొని మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత లేదు. అసంతృప్తి అంతా స్థానిక ఎమ్మెల్యేలపైనే. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గ్రామీణ ఓటర్లే అండగా నిలిచారు. గ్రామాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు అని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. కానీ ఎన్నికల దగ్గరకి వచ్చే సరికి దాదాపు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో గతంతో పోల్చితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు గణనీయంగా పడిపోయింది.
ఇప్పుడు ఏపీలో కూడా ప్రతి ఇంటికి జగన్ నేరుగా బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నారు. లబ్ధిదారునితో ప్రత్యక్ష సంబంధం పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పట్టణ ఓటర్లు వైసీపీకి దూరం అవుతారనే ప్రచారం సాగుతోంది. మా వద్ద పన్నులు వసూలు చేసి గ్రామీణులకు పెట్టడం ఏంటనే ప్రశ్నలు వారిలో ఉత్పన్నం అవుతున్నాయి. అలాగే అర్బన్ మిడిల్ క్లాస్ లో అభివృద్ధి లేదనే భావన వైసీపీకి ప్రతి కూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో జరిగిన పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. రాయలసీమ లో కూడా వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. తెలంగాణతో పోల్చితే పథకాల అమలులో స్థానిక నాయకుల ప్రభావం ఏపీలో తక్కువ. ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా లబ్ధిదారిని ఖాతాకే నగదు జమ చేస్తున్నారు. ఇది ఆపార్టీ సానుకూలాంశం. మరి దీనిని వైసీపీ ఓటుగా మలచుకుంటుందా లేదా అనేది చూడాలి. పట్టణ ప్రాంత ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేదానిపైనే ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.