జగన్.. ఇంకా లేటు చేస్తే నష్టమే?
పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉన్నా గ్రామీణులకు ముందు కావాల్సింది పోలీస్ నియామకాలు. ప్రభుత్వ ఉపాధ్యాయు పోస్టులు. ఇప్పటికే ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా పోలీస్ నియామకాలు చేపట్టింది. ఇవి చివరి దశకు చేరాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు ఏపీలో ఎప్పటి నుంచో ఉపాధ్యాయుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వస్తోందంటూ చర్చ సాగుతూనే ఉంది.
దీనిపై పలు సందర్భాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలోనే డీఎస్సీ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే డీఎస్సీ పై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు మూడు రోజుల్లో దీని గురించి ఓ స్పష్టమైన నిర్ణయం వస్తోందని తెలిపారు. దీని గురించి సీఎం జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు టీచర్ పోస్టుల గురించి ఓ నివేదికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ దశల్లో టీచర్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. డీఎస్సీ ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారు. ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు అనేది ప్రశ్న. ఒకవేళ డీఎస్సీ ప్రకటన విడుదల చేసి కాలయాపన చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. డీఎస్సీ వేయాలనుకుంటే మార్చిలోగా అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి. లేకపోతే వైసీపీ కి పెద్దగా రాజకీయ లబ్ధి చేకూరదని.. పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.