చంద్రబాబు దగ్గర కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఇదే?
చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరిలో కామన్ పాయింట్ చూసుకుంటే.. అనువు కానీ చోట అధికుల మనరాదు అనే సామెత గుర్తుకు వస్తుంది. ఇద్దరూ కూడా తమ పార్టీ ఓటమికి ముందు మోదీ గద్దె దించేద్దాం. దేశ రాజకీయాలను ఏలేద్దాం అనే తరహాలో వ్యాఖ్యానించారు. 2019లో ఓటమి అనంతరం వెంటనే చంద్రబాబుకి కనువిప్పు కలిగింది. తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు. కేసీఆర్ మాదిరిగా రెచ్చిపోకుండా ఎన్డేయేని తన దారిలోకి తెచ్చుకున్నారు. అవకాశం ఉన్నప్పుడు మోదీని పొగడటం, కేంద్ర నిర్ణయాలకు అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనడం లాంటివి చేశారు. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. అధికార వైసీపీపై పోరాడుతున్నారు.
సేమ్ చంద్రబాబు లాంటి పరిస్థితే ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి కేసీఆర్ కి చంద్రబాబు గురువు. కానీ ఆయన దగ్గర తెలివి తేటలను కేసీఆర్ నేర్చుకోలేదని అర్థం అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఫలితం కవిత అరెస్టు, కాళేశ్వరం, గొర్రెల, ధరణి లపై విచారణ. భవిష్యత్తులో ఆయన మరిన్ని విచారణలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే కేంద్రం అండా లేదు. రాష్ట్రంలో అధికారం లేదు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. సమయాన్ని బట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడంలో చంద్రబాబు మాదిరిగా కేసీఆర్ విఫలం అయ్యారు.