పవన్ కల్యాణ్: ఉస్సూరనిపిస్తున్న పవర్ స్టార్ ఫిట్ నెస్?
అక్కడే ప్రచారానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ తర్వాత ఆయన తెనాలిలో పర్యటించాల్సి ఉంది. వారాహి సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినా అనూహ్యంగా అస్వస్థతకు గురవడంతో హుటాహుటీన హైదరాబాద్ తిరిగి పయనమై వెళ్లారు. జ్వరంతో బాధపడుతున్న పవన్ ర్యాలీలతో పాటు, ఇరవై కిలోమీటర్లకు పైగా నడిచారు. ఇది వడదెబ్బకు కారణం అయింది. అస్వస్థతతోనే పిఠాపురంలో తన పర్యటన కొనసాగించిన పవన్ జ్వరం తీవ్రతరం అయ్యేవరకు తన కార్యకలాపాలు కొనసాగించారు.
అయితే పవన్ కల్యాణ్ అనారోగ్యంపై అభిమానులు పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి రాజుకొంది. అన్ని పార్టీలు తమ తమ రాజకీయ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయి. సీఎం జగన్ బస్సు యాత్ర మొదలు పెట్టారు. చంద్రబాబు ప్రజాగళాన్ని ముందుండి మరీ నడిపిస్తున్నారు. రోజుకి మూడు నియోజకవర్గాలు తగ్గకుండా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పవన్ వారాహి విజయ భేరీ యాత్రను ప్రారంభించి ఇప్పుడు విరామం ప్రకటించారు.
ఈ సమయంలో పవర్ స్టార్ ఫిట్ నెస్ పై కూడా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడు పదుల వయసులో చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా మండు టెండలు సైతం లెక్క చేయకుండా ప్రజా గళం సభలు నిర్వహిస్తున్నారు. కానీ పవర్ స్టార్ మాత్రం ఆరోగ్య విషయంలో ఆపసోపాలు పడుతున్నారు. ఇంకా వేసవి ముదరక ముందే ఇలా ఉంటే ఏప్రిల్ , మేలో ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని జనసైనికులు కలవరపడుతున్నారు.