ఆ జిల్లా అంటే చంద్రబాబుకు అంత ప్రేమ ఎందుకో?
మంగళగిరి నుంచి గెలుపొందిన నారా లోకేశ్, తెనాలి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నాదెండ్ల మనోహర్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లకు కీలక శాఖలు దక్కాయి. మంగళగిరికి ఐటీ కంపెనీలు, ఎలక్ర్టానిక్ సంబంధించిన యూనిట్లు తీసుకు వస్తానని ఎన్నికల సమయంలో నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ దకకింది. ఇప్పటికే మంగళగిరిలో కొన్ని కంపెనీలు ఉండగా.. మరికొన్ని రావడానికి మార్గం సుగమం కానుంది.
మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కి కీలకమైన పౌరసరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాలు శాఖ కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు కు పౌరసరఫరాల శాఖను కేటాయించారు. జిల్లాలో వరి విస్తారంగా పండుతున్నందున ధాన్యం సేకరణలో జిల్లాకు ప్రాధాన్యం పెరగనుంది. దీంతో పాటు కార్డుదారులకు నాణ్యమైన బియ్యం, సరకులు అందించేలా చూడనున్నారు.
ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రిగా గతంలో దివంగత ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పనిచేశారు. తర్వాత ఆ శాఖ అనగాని సత్యప్రసాద్ ని వరించింది. వైసీపీ ప్రభుత్వంలో రేపల్లె నేత మోపిదేవి వెంకటరమణ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యారు. ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ కు అరుదైన అవకాశం దక్కింది. దీంతో రేపల్లెలో గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అనేది మరోసారి నిరూపితం అయింది. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు వెలుగులు విరజిమ్మే విద్యుత్ శాఖను అప్పగించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంట్ కోతలు వంటి అంశాలతో గత వైసీపీ ప్రభుత్వం ఈ శాఖ విషయంలో అప్రతిష్ఠపాలు అయింది. అలాంటి శాఖను చంద్రబాబు గొట్టిపాటికి అప్పజెప్పారు.