స్వామి పలుకు.. డ్రస్ కోడ్ మార్చని జగన్ ..!
- సాధారణ కొలతలో ఉన్న షర్టు, ఫ్యాంటే జగన్ డ్రెస్
- సంక్రాంతి, ఉగాదికే చొక్కా-లుంగీ
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
ఒక్కొక్కళ్లకి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. ఎవరికి కలిసి వచ్చిన తీరిలో వారు సెంటిమెంటును ఫాలో అవుతారు. కొందరు తమకు కలిసి వస్తాయని భావించిన ఉంగరాలు పెట్టుకుంటారు. మరికొందరు ఒకే రంగు దుస్తులు ధరిస్తారు. ఫలితంగా వారి గ్రాఫ్ బాగుంటుందని నమ్ముతారు. జీవితంలోనూ మార్పులు వస్తాయని భావిస్తారు. ఇలానే.. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా.. ఓ స్వామి సూచనల మేరకు.. డ్రస్ కోడ్ పాటిస్తున్నారనే విషయం ఎక్కువ మందికి తెలియదు!! ఆశ్చర్యమే అయినా.. ఇది నిజం కూడా. విశాఖకు చెందిన శారదా మఠంతో జగన్‌కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సూచనల మేరకు.. జగన్.. డ్రస్ కోడ్ పాటిస్తున్నారని పార్టీవర్గాల్లో చర్చ సాగింది. నిజానికి 2014కు ముందు.. తర్వాత కూడా.. జగన్ పెద్దగా డ్రస్ కోడ్ పాటించలేదు. ఏరంగు దుస్తులైనా ధరించారు. అయితే.. ఎప్పుడూ ప్యాంట్-షర్ట్‌లోనే కనిపించేవారు. ఛాతీ భాగంలో టైట్ ఉన్న షర్టు, సాధారణ కొలతలోనే ఉన్నప్యాంటు ధరిం చేవారు. ఇది మనకు ఆయన చేసిన పాదయాత్ర నుంచి ప్రచారం వరకు కూడా కనిపిస్తుంది. అయితే.. పాదయాత్ర చేస్తున్న సమయంలోనే స్వామి స్వరూపానందతో సాన్నిహిత్యం ఏర్పడింది.
ఈ క్రమంలోనే జగన్ అధికారంలోకి రావాలంటూ.. స్వామి స్వరూపానంద పూజలు, యాగాలు కూడా చేశారు. ఇక, ఆ తర్వాత నుంచి జగన్ డ్రస్ కోడ్ మారిపోయింది. వైట్ కలర్ షర్టు, లైట్ బిస్కట్ కలర్ ప్యాంటు ధరించడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆరు మాసాల నుంచి ఆయన ఇదే కోడ్ పాటించారు. మనకు ఈ విషయం విశాఖలో 2019 ఎన్నికలకు ముందు జరిగిన కోడి కత్తి ఘటన సమయంలో కనిపిస్తుంది. అప్పుడప్పుడే.. ఆయన ఈ డ్రస్ కోడ్ పాటించడం ప్రారంభించారు. ఇక, ముఖ్యమంత్రి అయిన తర్వాత.. జగన్ పూర్తిగా డ్రస్ కోడ్ పాటించారు.
జగన్ ఎక్కడికి వెళ్లినా.. ఇదే డ్రస్‌లో వెళ్లారు. ఈ ఏడాది ఎన్నికలకు ముందు ప్రచారంలో పాల్గొన్నా.. ఆయన డ్రస్ కోడ్‌ను తూ.చ తప్పకుండా అమలు చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడకు వెళ్లినా.. జగన్ ఈ డ్రస్ కోడ్నే సెంటిమెంటుగా భావించారు. అయితే.. ఆయన రాజకీయాలను తన తండ్రి వారసత్వంతో తీసుకున్నానని చెప్పినా.. తెలుగు దనం ఉట్టి పడే విధంగా దివంగత వైఎస్ కట్టు-బొట్టు ఉన్నా.. దానిని మాత్రం జగన్ అవలంభించలేకపోయారు. అయితే.. సంక్రాంతి, ఉగాది సందర్భాల్లో ఆయన నివాసం తాడేపల్లిలో చేపట్టిన కార్యక్రమాల్లో మాత్రం చొక్కా-లుంగీ (కుచ్చీలు పోసిన పంచెకాదు) కట్టుకుని కనిపించేవారు. మరి డ్రస్ కోడ్ ఏమేరకు జగన్‌కు మేలు చేసిందో ఆయనకే తెలియాలి.