హైకోర్టు జగన్కు ఆ హోదా ఇస్తుందా?
అయితే దీనిపై స్పందన రాకపోవడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష హోదా కల్పించేలా ఏపీ అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. తనకుప్రతిపక్ష హోదా కోసం ఇప్పటికే స్పీకర్ కు లేఖ రాశానని.. అయినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. వైసీపీ శాసనసభా పక్షానికి జగన్ నాయకుడిగా ఉన్నారని.. ఆ హోదాలో అసెంబ్లీలో గళం వినిపించాలని కొందరు టీడీపీ నాయకులు హితబోధ చేస్తున్నారు. ప్రతిపక్ష నేత అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి సమావేశాలకు హాజరు కావాలని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు సూచించిన విషయం తెలిసిందే.
1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ లేదా.. శాసన సభలో ప్రతి పక్ష హోదా దక్కాలంటే.. ఆ సభలో కనీసం పది శాతం సీట్లను విపక్ష పార్టీ గెలుచుకొని ఉండాలి. ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన రాజకీయ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించే పరిస్థితి ఉంటుంది. మరి వైసీపీ 11 స్థానాలు దక్కించుకోవడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలో మిగిలిపోవాల్సి వచ్చింది.
ప్రతిపక్ష నేత హోదా దక్కితే కొన్ని సదుపాయాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జగన్ కు ఆ అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏపీలో ప్రస్తుతం వైసీపీనే ప్రతిపక్ష పార్టీ అయినా అసెంబ్లీలో ఆ హోదా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మరి జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.