బాబు చేస్తే ఒప్పు.. జగన్ చేస్తే తప్పు.. ఇదే అసలు లెక్క?
ఇప్పుడు సీన్ మారింది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే తరహా విమర్శలు చేస్తోంది. ఏపీలో ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుంది అని ఆరోపిస్తూ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు దిల్లీలో నిరసన తెలిపారు. ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆయన దిల్లీని వేదికగా చేసుకున్నారు. ఇప్పటికే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
ఏపీలో ఎన్నికలు జరిగిన అనంతరం హింస జరిగింది అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ హత్యకు గురి కావడం, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి వాహనాలను కొందరు ధ్వంసం చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో రాజకీయ వేడిని అమాంతం పెంచాయి. రషీద్ హత్యను టీడీపీ ప్రభుత్వం చేయించిన హత్యగా వైఎస్ జగన్ ఆరోపించారు.
అయితే గతంలోను వైసీపీ హయాంలో హత్యలు, ఘర్షణలు జరిగాయి. చనిపోయిన వారిలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. 2022లో తోట చంద్రయ్య హత్యకు గురికాగా.. చంద్రబాబు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. 2020లో టీడీపీ నాయకులు బోండా ఉమా, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై కూడా రాళ్ల దాడి జరిగింది. 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి, ఆ తర్వాత ఎన్నికలు సమయంలోను, ఆ తర్వాత దాడులు కొనసాగాయి. అయితే ప్రభుత్వాలు మారుతున్నా దాడులు, ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నాడు జరిగిన వైసీపీ హయాంలో జరిగిన ఘటనలను ప్రభుత్వంపై ఆపాదించిన టీడీపీ నేతలు.. ప్రస్తుతం జరుగుతున్న వాటిని వ్యక్తిగత ఘర్షణలుగా చెబుతూ.. వైసీపీ డైవర్ట్ రాజకీయాలకు పాల్పడుతోందని చెబుతోంది.